సీటివ్వండి..లేకపోతే చచ్చిపోతా!
పెందుర్తి ప్రభుత్వ కళాశాల వద్ద విద్యార్థి హల్‌చల్
గంజాయి మత్తులో వీరంగం
డ్రగ్స్ రీహబిలిటేషన్ కేంద్రానికి తరలించిన పోలీసులు
పెందుర్తి: గంజాయి మత్తులో ఓ టీనేజర్ పెందుర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద సోమవారం వీరంగం సృష్టించాడు. గతేడాది ఇదే కళాశాలలో చదువుకున్నానని..కానీ బహిష్కరించారని..ఇప్పుడు తనకు సీటివ్వకపోతే చచ్చిపోతానని బెదిరించాడు. కర్రతో రోడ్డుపై వచ్చేపోయే వాహనాలకు ఇబ్బంది కలిగించాడు. రోడ్డుపై పడుకొని తీవ్రస్థాయిలో అలజడి రేపాడు. చివరకు పోలీసులు రంగప్రవేశం చేసి అతడ్ని రిహబిలిటేషన్ కేంద్రానికి తరలించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.
వివరాలివి..పెందుర్తి ప్రాంతానికి చెందిన ఓ విద్యార్థి (17) గతేడాది పెందుర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరాడు. అయితే అతడి అలవాట్లు, క్రమశిక్షణారాహిత్యం కారణంగా అప్పట్లో కళాశాల నుంచి టీసీ ఇచ్చి పంపేశారు. అయితే సదరు విద్యార్థి గంజాయి మత్తులో సోమవారం కళాశాల ప్రాంగణానికి వచ్చి కర్రలతో విద్యార్థులను హడలగొట్టాడు. తనకు మళ్లీ సీటు ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానని వాహనాల మధ్యకు వెళ్లి అలజడి రేపాడు. దీనిపై సమాచారం అందుకున్న ఎస్‌ఐ అసిరితాత వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సదరు టీనేజర్‌ను అదుపులోని తీసుకుని స్టేషన్‌కు తరలించారు. సీఐ రామకృష్ణ ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ నిర్వహించిన అనంతరం ప్రభుత్వ రిహబిలిటేషన్ కేంద్రానికి తరించారు.
Comments
Please login to add a commentAdd a comment