ప్రతి సమస్యకూ పరిష్కారం చూపండి
మేయర్ గొలగాని హరివెంకటకుమారి
డాబాగార్డెన్స్: గత సర్వ సభ్య సమావేశంలో సభ్యులు లేవనెత్తిన సమస్యలు/అభ్యంతరాలకు పరిష్కార మార్గం చూపించాలని మేయర్ గొల గాని హరి వెంకటకుమారి.. జీవీఎంసీ కమిషనర్ సంపత్‌కుమార్‌ను ఆదేశించారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయ సమావేశ మందిరంలో గురువారం కమిషనర్, ఇతర ఉన్నతాధికారులతో గత సర్వ సభ్య సమావేశంలో సభ్యులు అడిగిన సమస్యల పరిష్కార చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ డిసెంబర్ మొదటి వారంలో కౌన్సిల్ సమావేశం ఉంటుందని, ఈ సమావేశానికి ముందే గత కౌన్సిల్‌లో సభ్యులు లేవనెత్తిన సమస్యలు పరిష్కరించాలన్నారు. జీరో అవర్ సమస్యలకు సంబంధించి చేపట్టిన పరిష్కార చర్యలపై మరో సమీక్ష నిర్వహిస్తామని మేయర్ చెప్పారు. కమిషనర్ మాట్లాడుతూ సభ్యులు లేవనెత్తిన ప్రతి సమస్యకూ సమాధానం/పరిష్కార మార్గాలను అధికారులు సిద్ధం చేశారని వివరించారు. అదనపు కమిషనర్లు డీవీ రమణమూర్తి, ఆర్.సోమన్నారాయణ, ఎస్‌ఎస్ వర్మ, కార్యదర్శి బి.వి. రమణ, ప్రధాన వైద్యాధికారి నరేష్‌కుమార్ పాల్గొన్నారు.


