అన్నీ ఆన్‌లైన్‌లోనే..!
గతంలో ఏ మ్యాచ్ అయినా ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లోను టికెట్ల విక్రయాలు చేపట్టేవారు. ఈ సారి మాత్రం ఆఫ్‌లైన్‌లో టికెట్ల విక్రయాలు జరగలేదు. గతంలో క్యూలో ఉంటే తమకు టికెట్ దొరుకుతుందనే ఆశతో క్రికెట్ అభిమానులు కొనుగోళ్లకు ఆసక్తి చూపేవారు. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ఎప్పుడు టికెట్లను విక్రయిస్తారా అని వేచిచూడాల్సి వస్తోంది. ఒకవేళ ఆ సమయానికి సరిగ్గా ఆన్‌లైన్‌లో ఉండి.. టికెట్లను కొనుగోలు చేద్దామంటే మీ కంటే ఇంకా కొన్ని వేల మంది క్యూలో ఉన్నారంటూ వస్తోంది. అంత సమయం ఓపికగా వేచి ఉండి.. టికెట్లను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తే.. ముందు వరుసలోని సీట్లన్నీ అప్పటికే అమ్మకాలు జరిగినట్టుగా చూపెడుతోంది. ఈ ముందు వరుసలోని సీట్లన్నీ ఏసీఏలోని నేతలు వారి అనుచరులకే కట్టబెడుతున్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. ఏకంగా రూ.6 వేలు, రూ.12 వేలు, రూ.20 వేల వరకూ చెల్లించి కొనుగోలు చేసే టికెట్లను కూడా వెనుక వరుసలో ఉండి చూడాల్సి వస్తోందని క్రికెట్ అభిమానులు వాపోతున్నారు. ఫలితంగా అనేక మంది టికెట్లను కొనుగోలు చేయకుండానే ఉండిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే గత మ్యాచ్‌లో గ్రౌండ్ సగం వరకు ఖాళీగా దర్శనమిచ్చింది. ఈ దఫా కూడా ఏసీఏలో ఎటువంటి మార్పు రాలేదని అభిమానులు మండిపడుతున్నారు. అయితే టికెట్ల విక్రయంతో తమకు నేరుగా సంబంధం లేదని.. సదరు ఫ్రాంచైజీలే చూసుకుంటాయంటూ ఏసీఏ నేతలు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.


