మేయర్ పదవి ఇస్తే రూ.5 కోట్లు ఖర్చు చేస్తానన్న ఓ కార్పొరేటర్
తమకు డిప్యూటీ మేయర్ పదవి కావాలంటున్న ఆరుగురు కార్పొరేటర్లు
డిప్యూటీ మేయర్ కోసం ఇప్పటికే టీడీపీ నుంచి బరిలో ఉన్న నలుగురు కార్పొరేటర్లు
కొత్త తలనొప్పుల నేపథ్యంలో క్యాంపునకు వెళ్లాలని ఆదేశం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : జీవీఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్లపై కూటమి ప్రభుత్వం పెట్టిన అవిశ్వాసం కాస్తా ఆ పార్టీ నేతలకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఇప్పటికే టీడీపీ నుంచి మేయర్ అభ్యర్థిగా ఒకరు, డిప్యూటీ మేయర్ పోస్టుల కోసం ఇద్దరు బరిలో ఉండగా.. జనసేన నుంచి మేయర్ పోస్టును ఒకరు, డిప్యూటీ మేయర్ పోస్టులను ఆరుగురు కార్పొరేటర్లు ఆశిస్తున్నారు. జనసేనకు చెందిన ఓ కార్పొరేటర్ ఏకంగా తనకు మేయర్ పదవి ఇస్తే రూ.5 కోట్ల వరకూ ఖర్చు చేసేందుకు సిద్ధమని గురువారం జరిగిన జనసేన కార్పొరేటర్ల సమావేశంలో ప్రకటించడం గమనార్హం. అంతేకాకుండా మరో ఆరుగురు కార్పొరేటర్లు తమకు డిప్యూటీ మేయర్ పదవి కావాలని కోరారు.
ఈ నేపథ్యంలో పదవులు ఆశిస్తున్న కార్పొరేటర్లకు పదవులు దక్కకపోతే అసలుకే ఎసరు వస్తుందని గ్రహించిన జనసేన నేతలు కూడా క్యాంపు రాజకీయాలకు తెరలేపారు. మొన్నటికి మొన్న తాము క్యాంపు రాజకీయాలకు దూరంగా ఉంటామన్న జనసేన పార్టీ కూడా... తన వైఖరిని మార్చుకుని కార్పొరేటర్లను క్యాంపునకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తుండటం గమనార్హం. సరదాగా షికారు చేసి రండి అని పేర్కొన్న ఎమ్మెల్యే వంశీకృష్ణ.. ఎవరెవరు వెళ్తారో జాబితా ఇవ్వాలని కోరినట్లు సమాచారం. మొత్తంగా మేయర్, డిప్యూటీ మేయర్‌లపై పెట్టిన అవిశ్వాసం కాస్తా కూటమి పార్టీల్లో కొత్త సమస్యలను ముందుకు తెస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మాకు డిప్యూటీ మేయరు కావాల్సిందే..!
ఒకవైపు తనకు మేయర్ సీటు ఇస్తే రూ.5 కోట్ల మేర ఖర్చు చేస్తానని విశాఖ దక్షిణ నియోజకవర్గానికి చెందిన ఓ కార్పొరేటర్ ముందుకు వచ్చారు. ప్రస్తుతం కూటమి నుంచి మేయర్ సీటు ఆశిస్తున్న వ్యక్తి తమకు ఇప్పటివరకు నయాపైసా ఇవ్వలేదని.. కనీసం తమతో సంప్రదించే ప్రయత్నం చేయలేదని కొందరు కార్పొరేటర్లు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో జనసేన నుంచి మేయర్ అభ్యర్థిగా ప్రకటిస్తే... తాను బరిలో ఉండటమే కాకుండా మొదటగా మన పార్టీకి చెందిన కార్పొరేటరు అభ్యర్థులకే ఎంత మొత్తం ఇవ్వాలనేది నిర్ణయిస్తామని కూడా సదరు కార్పొరేటరు స్పష్టంగా ప్రకటించారు. ఒకవేళ మేయర్ కాదంటే రెండు డిప్యూటీ మేయర్లు కచ్చితంగా జనసేనకు ఇవ్వాల్సిందేనని కార్పొరేటర్లు ముక్త కంఠంతో డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది.
అయితే, రెండు డిప్యూటీ మేయర్లు ఇవ్వాలంటూ పార్టీ అధిష్టానాన్ని కోరానని.. ఇప్పటికే ఒకటి ఇచ్చేందుకు అంగీకరించారని వంశీకృష్ణ చెప్పినట్టు తెలుస్తోంది. అయితే డిప్యూటీ మేయరు పదవులను కందుల నాగరాజు, సాధిక్, ఉషశ్రీతో పాటు మరో ముగ్గురు ఆశిస్తున్నట్టు స్పష్టం చేశారు. పార్టీ సింబల్ మీద గెలిచిన వారినే బరిలో నిలపాలని డిమాండ్‌ను కొందరు కార్పొరేటర్లు తెరమీదకు తీసుకొచ్చారు. దీనిపై పార్టీ మారిన, స్వతంత్య్ర అభ్యర్థులు అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో చివరకు ఎవరు ఏ స్టాండు తీసుకున్నా.. అసలుకే ఎసరు వస్తుందని గ్రహించిన జనసేన పార్టీ కూడా క్యాంపు రాజకీయాలకు తెరలేపింది. ఎవరెవరు క్యాంపునకు వెళతారనే జాబితాను తయారుచేసి పంపేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.
మాకూ వాటా ముట్టాల్సిందే...!
తమ అధినేత పవన్ కల్యాణ్ చెప్పిన మాటకు కట్టుబడి ఉంటామని, క్యాంపు రాజకీయాలకు దూరమని జనసేన నేతలు ప్రకటించారు. తీరా కార్పొరేటర్ల సమావేశాన్ని నిర్వహించిన సందర్భంలో ఇందుకు భిన్నమైన వాతావరణం కనిపించినట్టు తెలుస్తోంది. మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక సందర్భంగా తమకు ఎంత ఇస్తారని నేరుగా వంశీని కొందరు కార్పొరేటర్లు అడిగినట్టు సమాచారం. అయితే, నిర్దిష్టంగా ఇంత మొత్తం ఇస్తామనే హామీ రాకపోవడంతో సదరు కార్పొరేటర్లు కాస్తా అసంతృప్తిని వెలిబుచ్చారు. తమ వాటా తేలిన తర్వాతే నిర్ణయం చెబుతామని కొందరు కార్పొరేటర్లు కుండబద్దలు కొట్టినట్టు సమాచారం.
గత స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూడా నయాపైసా ఇవ్వకపోవడంతో పాటు స్టాండింగ్ కమిటీలో ఒక్క పోస్టు కూడా ఇవ్వని విషయాన్ని ప్రస్తావించినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఇప్పటికే టీడీపీ నుంచి డిప్యూటీ మేయర్ పోస్టులను మొల్లి హేమలత, గొలగాని మంగవేణి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా ఉన్న పల్లా శ్రీను, గంధం శ్రీనులు ఆశిస్తున్నారు. దీంతో పాటు చిన్నలక్ష్మీ కూడా డిప్యూటీ మేయర్ పదవి ఆశిస్తున్నారు. ఒకవైపు టీడీపీలోనే డిప్యూటీ మేయర్ పోస్టుల కోసం పోటీ ఉండగా.. జనసేన నుంచి అదే స్థాయిలో పోటీ ఉండటం కూడా కూటమి పార్టీలకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది.


