వైజాగ్‌.. వద్దే వద్దు.! | - | Sakshi
Sakshi News home page

వైజాగ్‌.. వద్దే వద్దు.!

Apr 13 2025 1:39 AM | Updated on Apr 13 2025 1:39 AM

వైజాగ

వైజాగ్‌.. వద్దే వద్దు.!

సర్వీసుల నుంచి ఒక్కొక్కటిగా తప్పుకుంటున్న ఎయిర్‌లైన్స్‌లు

సాక్షి, విశాఖపట్నం: ‘దుబాయ్‌కు విమానం తీసుకొస్తాం.. వియత్నాంకు సర్వీసు తెస్తాం.. దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు డొమెస్టిక్‌ విమాన సర్వీసులు విశాఖ నుంచి నడిచేలా చేస్తాం.’ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కింజరాపు రామ్మోహన్‌నాయుడు బాహాటంగా చేసిన ప్రకటన ఇది.

కట్‌ చేస్తే...

‘దుబాయ్‌ సర్వీసు విజయవాడ వెళ్లిపోయింది. వియత్నాం సర్వీసు హైదారాబాద్‌కు వెళ్లిపోయింది. కొత్త విమానాల మాట దేవుడెరుక.. ఇప్పుడు ఉన్న అంతర్జాతీయ సర్వీసులు కూడా గోవిందా.. గోవిందా.. నిత్యం రద్దీగా తిరిగే బ్యాంకాక్‌, కౌలాలంపూర్‌ సర్వీసులను వైజాగ్‌ నిలిపేస్తున్నట్లు ఎయిర్‌లైన్స్‌ ప్రకటించింది.’’

● ఇదీ కూటమి సర్కారుకు విశాఖపై కురిపిస్తున్న కపట ప్రేమకు నిదర్శనం. జాతీయ, అంతర్జాతీయ సర్వీసులతో కళకళలాడుతున్న వైజాగ్‌ ఎయిర్‌పోర్టు.. మరికొద్ది రోజుల్లో కళావిహీనంగా మారిపోబోతోంది. కారణం ప్రభుత్వ నిర్లక్ష్యం. కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు చేతకానితనం.

తన చేతిలోనే పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ ఉన్నా.. ఏనాడు విశాఖ ఎయిర్‌పోర్టు అభివృద్ధి కోసం పట్టించుకున్న పాపాన పోలేదు. ఫలితంగా ఎయిర్‌లైన్స్‌ సంస్థలు వైజాగ్‌ వద్దే వద్దంటూ మూటాముళ్లు సర్దుకొని వెళ్లిపోతున్నాయి.

బ్యాంకాక్‌, మలేషియాకు రాం రాం.!

కరోనా తర్వాత అంతర్జాతీయ సర్వీసులు వైజాగ్‌ నుంచి అవసరమంటూ పట్టుబట్టి మరీ.. సింగపూర్‌ సర్వీసుని గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టింది. 2023 ఏప్రిల్‌ 9న బ్యాంకాక్‌కు, 2024 ఫిబ్రవరిలో ప్రకటించిన తర్వాత అదే ఏడాది ఏప్రిల్‌ 26న కౌలాలంపూర్‌కు ఎయిర్‌ ఏసియా సంస్థ అంతర్జాతీయ సర్వీసులను విశాఖ నుంచి ప్రారంభించింది. మొన్నటి వరకూ దాదాపు ఫుల్‌ ప్యాక్‌తో సర్వీసులు నడిచాయి. బ్యాంకాక్‌ సర్వీసులో ప్రతిరోజూ దాదాపు 200 మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. కౌలాలంపూర్‌ సర్వీసు ప్రతి రోజూ 150 నుంచి 200 మంది ప్రయాణికుల్ని గమ్యస్థానాలకు చేరవేస్తోంది. అయినప్పటికీ ఈ సర్వీసుల్ని మే ఒకటి నుంచి నిలిపేస్తున్నట్లు ఎయిర్‌ఏసియా సంస్థ ప్రకటించింది. ఇకపై వైజాగ్‌ నుంచి ఒకే ఒక్క సింగపూర్‌ సర్వీస్‌ నడవనుంది. పది సర్వీసులు తీసుకొస్తానన్న కేంద్ర మంత్రి చివరికి ఒకే ఒక్క సర్వీసుకి పడిపోయేలా చేశారంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. పోనీ కొత్త సర్వీసుల విషయంలోనైనా జాగ్రత్తగా ఉన్నారా అంటే అదీ లేదు. ప్రముఖ ఎయిర్‌లైన్స్‌ సంస్థ ఎమిరేట్స్‌ ఏపీ నుంచి దుబాయ్‌కు విమాన సర్వీసు నిర్వహించేందుకు సిద్ధమైన తరుణంలో.. రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావడంతో విజయవాడ నుంచి ప్రారంభించేసింది. ఇక వైజాగ్‌ నుంచి నుంచి వియత్నాంలోని ప్రధాన నగరం హొచిమిన్‌ సిటీకి ఈ ఏడాది సర్వీసు ప్రారంభిస్తామని వియట్‌జెట్‌ ఎయిర్‌లైన్స్‌ ప్రకటించింది. కానీ ప్రభుత్వం స్పందించకపోవడంతో హైదరాబాద్‌ నుంచి సర్వీసులు ప్రారంభించేసింది. ఇలా ఉన్నవీ పోయి.. కొత్తవీ తీసుకురాకపోవడం సిగ్గు చేటు అని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కేంద్ర మంత్రికి విన్నవించుకున్నాం..

విశాఖ నుంచి విదేశాలకు వెళ్తున్న వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. టైర్‌–2 నగరాల నుంచి కూడా విదేశీయానానికి అవకాశాలు పుష్కలమవ్వడంతో అవుట్‌ బౌండ్‌ టూరిజం గణనీయంగా వృద్ధి చెందుతోంది. దీనికి తోడు వీసా లేకుండా రావొచ్చంటూ వివిధ దేశాలు ప్రకటించడంతో కొత్త సర్వీసుల కోసం ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సమయంలో ఉన్న సర్వీసులు కూడా నిలిచిపోవడం బాధాకరం. ఈ తరహా సర్వీసుల రద్దు భవిష్యత్తులో విశాఖ ఎయిర్‌పోర్టుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ విషయంలో చొరవ చూపించాలని కేంద్ర మంత్రికి అసోసియేషన్ల తరఫున లేఖలు రాశాం.

–విజయ్‌మోహన్‌, ఏపీ ట్రావెల్‌ అండ్‌ టూర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు

సోషల్‌ మీడియాలోనే అభివృద్ధి.!

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్‌నాయుడుని నియమించినప్పుడు వైజాగ్‌ ఎయిర్‌పోర్టుకు మంచిరోజులు వచ్చాయని అంతా భావించారు. ప్రస్తుతం ఉన్న రెండు మూడు విదేశీ సర్వీసులకు అదనంగా మరో 5 వరకూ సర్వీసులు రానున్నాయని అంతా ఆశించారు. ఆయన కొత్త సర్వీసులు తీసుకురాకపోగా ఉన్న సర్వీసులకు ఎసరెట్టేలో వ్యవహరిస్తున్నారన్నది జగమెరిన సత్యం. తాను అది చేస్తున్నాను.. ఇది చేస్తున్నానంటూ కేవలం సోషల్‌ మీడియాలోనే అభివృద్ధి చూపించేస్తున్న మంత్రి.. వైజాగ్‌ ఎయిర్‌పోర్టు విషయంలో మా త్రం తనకేమీ పట్టనట్లుగా ఉన్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత క్రమంగా విశాఖ ప్రతిష్ట మసకబారుతుండటంతో.. ఇక్కడ ల్యాండ్‌ అవుతున్న విమానాలు.. ఇక సెలవు అంటూ బైబై చెప్పేస్తున్నాయి.

విశాఖకు బైబై.. విజయవాడకు రయ్‌ రయ్‌

డొమెస్టిక్‌ సర్వీసులూ విశాఖ నుంచి ఒక్కొక్కటిగా దూరమవ్వడం మొదలైంది. విశాఖ నుంచి విజయవాడకు ఉదయం సమయంలో ఉన్న సర్వీసుల్ని రద్దు చేసినట్లు ఇండిగో ఎయిర్‌లైన్స్‌ సంస్థ ప్రకటించింది. ఈ విమానాన్ని రాయ్‌పూర్‌ నుంచి రాజ్‌కోట్‌కు నడుపుతున్నట్లు స్పష్టం చేసింది. ఉన్న సర్వీసులు పోతున్న నేపథ్యంలో ప్రముఖ ఎయిర్‌లైన్స్‌ ఆకాశా సంస్థ వైజాగ్‌ నుంచి హైదరాబాద్‌తో పాటు దేశంలోని వివిధ నగరాలకు సర్వీసులు నడిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. ఈ విషయంపై కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖతో పాటు.. వైజాగ్‌ ఎయిర్‌పోర్టు అధికారులకు రెండు నెలల క్రితమే సమాచారం పంపించినా.. కేంద్ర మంత్రి నుంచి స్పందన లేకపోవడంతో ఆకాశా ఎయిర్‌లైన్స్‌ ప్రతినిధులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాము కోరుండి సర్వీసులు నడుపుతామన్నా పట్టించుకోనప్పుడు.. వైజాగ్‌లో నడిపేందుకు ఎందుకు ఆసక్తి చూపించాలని ప్రశ్నిస్తున్నారు.

ఇటీవలే విజయవాడ సర్వీసుని రద్దు చేసిన ఇండిగో

ఇప్పుడు రెండు ఇంటర్నేషనల్‌ సర్వీసులను నిలిపేస్తున్నఎయిర్‌ ఏసియా

ఇకపై వైజాగ్‌ నుంచి బ్యాంకాక్‌, మలేసియా విమానాలు ఉండవ్‌

వైజాగ్‌.. వద్దే వద్దు.!1
1/2

వైజాగ్‌.. వద్దే వద్దు.!

వైజాగ్‌.. వద్దే వద్దు.!2
2/2

వైజాగ్‌.. వద్దే వద్దు.!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement