భరోసా దక్కని బతుకులు
మహారాణిపేట: మత్స్యకారులకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. సోమవారం అర్ధరాత్రి నుంచి చేపల వేట నిషేధం అమలులోకి వస్తోంది. జూన్ 15 వరకు కొనసాగనుంది. మత్స్య సంపద ఉత్పత్తి అయ్యే సమయం కావడంతో ప్రతి ఏటా రెండు నెలలపాటు వేట నిషేధం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో సంపాదన లేక ఖాళీగా ఉండే గంగపుత్రుల జీవనానికి ప్రభుత్వం భృతి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రాకముందు రూ.2 వేల చొప్పున పరిహారం అందజేసేవారు. చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఎప్పుడో ఆరేడు నెలల తర్వాత భృతి మంజూరు చేసేది. అది కూడా స్థానికంగా పలుకుబడిన నాయకుల అనుచరులకు మాత్రమే ఇచ్చేవారు. పాదయాత్రలో గంగపుత్రుల సమస్యలు స్వయంగా తెలుసుకున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వేట నిషేధ భృతిని రూ.10 వేలకు పెంచుతానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం 2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే వేట నిషేధ నష్టపరిహారం రూ.10 వేలకు పెంచడంతోపాటు ప్రతి ఏటా మే నెలాఖరుకు మత్స్యకారుల ఖాతాల్లో జమ చేశారు. ఇలా ఐదేళ్ల పాటు నిరాటంకంగా మత్స్యకార భరోసాను అమలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మత్స్యకార భృతిని రూ.10 వేల నుంచి రూ.20 వేలకు పెంచుతామని టీడీపీ, జనసేన పార్టీలు ప్రకటించాయి. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది ఇవ్వాల్సిన భరోసా ఇంతవరకు అమలు చేయలేదు. అసలు ఎప్పుడిస్తారో కూడా చెప్పలేదు. ఉమ్మడి విశాఖ జిల్లాలో సుమారు 34 తీరప్రాంతాల్ని ఆనుకుని మత్స్యకార గ్రామాలున్నాయి. వీటిలో లైసెన్స్ కలిగిన మెకనైజ్డ్ బోట్లు, ఇంజను బోట్లు, తెప్పలు, తెరచాపలతో సముద్రంలో వేట సాగించే మత్స్యకారులు సుమారు 26 వేల మంది ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఇస్తానన్న రూ.20 వేలు ఇవ్వకపోగా గత ప్రభుత్వం ఇచ్చే రూ.10 వేలు కూడా ఇవ్వడం మానేసిందంటూ గంగపుత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి గత ఏడాది నష్టపరిహారం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో క్రమం తప్పకుండా..
వేటకు వెళ్లే మత్స్యకార కుటుంబాలకు పూర్వం రూ.2 వేలు, బియ్యం, ఇతర నిత్యావసరాలు ఇచ్చే వారు. ఆ తర్వాత నిత్యావసరాలకు ఫుల్‌స్టాప్ పెట్టి రూ.4 వేల చొప్పున భృతి ఇచ్చారు. అది కూడా వేట నిషేధం ముగిసిన తర్వాత ఆర్నెల్లకో ఏడాదికో ఎప్పుడిచ్చేది కూడా తెలిసేది కాదు. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు నిషేధ భృతిని రూ.4 వేల నుంచి రూ.10 వేలకు పెంచి నిషేధ కాలంలోనే పార్టీలు, కులాలు, మతాలకతీతంగా అర్హులైన ప్రతీ ఒక్కరికి ఇచ్చి వైఎస్ జగన్ ప్రభుత్వం అండగా నిలిచింది. మెకనైజ్డ్, మోటరైజ్డ్ బోట్లకే కాకుండా.. తెప్పలు ఇతర సంప్రదాయ నావలపై వేట సాగించే వారికి సైతం ఈ సాయాన్ని వర్తింప జేసింది.
అమల్లోకి వచ్చిన చేపల వేట నిషేధం
61 రోజులు విరామం
ఒడ్డుకు చేరుకున్న 2,500 బోట్లు
మత్స్యకార భరోసా హామీ నిలుపుకోని కూటమి ప్రభుత్వం
ఆందోళనలో మత్స్యకార కుటుంబాలు
మత్స్యకారులు సహకరించాలి
ఈ నెల 15వ తేదీ నుంచి జూన్ 14వ తేదీ వరకు తూర్పు సముద్ర తీర ప్రాంతంలో వేట నిషేధం అమల్లో ఉంటుంది. ఈ రోజుల్లో మత్స్య సంపద పరిరక్షణ, పునరుత్పత్తి, నిర్వహణ దృష్ట్యా సముద్రంలో వేట నిషేధం అమలు చేస్తున్నాం. మత్స్యకారులంతా ప్రభుత్వానికి సహకరించాలి.
–చంద్రశేఖరరెడ్డి,
ఇన్‌చార్జీ జాయింట్ డైరెక్టర్, మత్స్యశాఖ
తీరానికి బోట్లు
జిల్లాలో 65 కిలోమీటర్ల తీర ప్రాంతం, 32 మత్స్యకార గ్రామాలు, 15 ఫిష్ లాండింగ్ కేంద్రాలు ఉన్నాయి. సుమారు 1.15 లక్షల మత్స్యకార కుటుంబాలు ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాయి. మత్స్య సంపద పరిరక్షణ, పునరుత్పత్తి కోసం ఈ నిషేధం విధిస్తున్నట్లు మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ పి.లక్ష్మణరావు తెలిపారు. ఇంజిన్, యాంత్రిక (మెకనైజ్డ్)బోట్లకు ఈ నిషేధం వర్తిస్తుందని, మత్స్యకారులు ప్రభుత్వానికి సహకరించాలని జేడీ చంద్రశేఖరరెడ్డి కోరారు. నిషేధం అమలులోకి రావడంతో దాదాపు 2,500 బోట్లు విశాఖ ఫిషింగ్ హార్బర్‌కు చేరుకున్నాయి. మంగళవారం నుంచి పూర్తిస్థాయిలో వేట నిషేధం అమల్లో ఉంటుంది.


