ఒలింపిక్ సంఘం నూతన కార్యవర్గం ఏర్పాటు
విశాఖ స్పోర్ట్స్: విశాఖ జిల్లా ఒలింపిక్ సంఘం (వీడీఏవో) నూతన కార్యవర్గాన్ని సోమవారం ప్రకటించారు. ఎన్నికల అధికారి పృధ్వీరాజ్ ఎన్నికల ప్రక్రియను వివరించారు. మార్చి 2న రిజల్యూషన్ ద్వారా రిటర్నింగ్ అధికారిని నియమించామని, ఓటర్ల జాబితా పరిశీలన, నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ అనంతరం ఈ నెల 13న ఎన్నిక నిర్వహించామని తెలిపారు. నూతన కార్యవర్గంలో అధ్యక్షుడిగా హర్షవర్దన్, కార్యదర్శిగా లలిత్‌కుమార్, కోశాధికారిగా కిషోర్‌కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే, నలుగురు ఉపాధ్యక్షులు, ముగ్గురు సంయుక్త కార్యదర్శులు, పది మంది ఈసీ సభ్యులు కూడా ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు తెలిపారు. రాష్ట్ర ఒలింపిక్ సంఘం పరిశీలకుడు కేపీ రావు మాట్లాడుతూ, ఒక జిల్లా ఒకే సంఘం అనే నినాదంతో ఎన్నికల ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. వచ్చే జూలైలో విశాఖలోనే రాష్ట్ర ఒలింపిక్ సంఘం ఎన్నికలు జరుగుతాయని ఆయన వెల్లడించారు. కార్యక్రమంలో చీఫ్ పాట్రన్ శివశంకర్ పాల్గొన్నారు.


