
నిర్మాణంలో జాప్యం.. నిత్యం నరకం
● పెరుగుతున్న రాకపోకల కారణంగా విశాఖ చేరుకోని చాలా రైళ్లు
● ఔటర్‌లో గంటల తరబడి ప్లాట్ ఫాం కోసం ఎదురుచూపులు
● రద్దీ పేరుతో మరికొన్ని రైళ్లు బైపాస్ మీదుగా మళ్లింపు
థర్డ్, ఫోర్త్ రైల్వే లైన్ల పనులు ప్యాసింజర్ వేగంతోనే..!
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం రైల్వే స్టేషన్‌కు సమీపం(ఔటర్)లోకి చేరుకున్న రైలు.. ప్లాట్‌ఫాంపైకి రావడానికి కనీసం అరగంట సమయం పడుతోంది. స్టేషన్‌లో విపరీతంగా పెరుగుతున్న రైళ్ల రద్దీయే ఇందుకు ప్రధాన కారణం. ఈ సమస్యకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించిన రైల్వే అధికారులు.. సింహాచలం వద్ద మూడో, నాలుగో లైన్ల నిర్మాణాన్ని ప్రతిపాదించారు. మూడో లైన్‌కు అనుమతి లభించి దశాబ్దం దాటింది. నాలుగో లైన్‌కు పచ్చజెండా ఊపి నాలుగేళ్లు గడిచాయి. అయినా, పనుల పురోగతి మాత్రం నత్తనడకన సాగుతోంది. ఈ రెండు లైన్లు పూర్తయితే.. విశాఖపట్నం రాకుండానే బైపాస్ మీదుగా రైళ్ల రాకపోకలకు చెక్ పడే అవకాశం ఉంది. కానీ, రైల్వే అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ నిర్మాణ పనులు పాసింజర్ రైలులా నెమ్మదిగా సాగుతున్నాయి. అయితే తాజాగా ఈ ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణకు అడ్డంకులు తొలగడంతో, ఇకపై పనులు సూపర్ ఫాస్ట్‌లా వేగవంతం అవుతాయని వాల్తేరు డివిజన్ అధికారులు చెబుతున్నారు.
విశాఖపట్నం రైల్వే స్టేషన్ ఒక టెర్మినల్ పాయింట్. స్టేషన్ ముందు సముద్ర తీరం ఉండటంతో రైళ్లు ముందుకు వెళ్లే మార్గం లేదు. స్టేషన్‌కు వచ్చిన రైలు తిరిగి వెళ్లాలంటే.. ఇంజిన్‌ను బోగీల నుంచి విడదీసి, వెనుక వైపునకు వచ్చి మరలా కలపాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియకు కనీసం 20 నుంచి 30 నిమిషాల సమయం పడుతుంది. అప్పటివరకు రైలు ప్లాట్‌ఫాంపైనే నిలిచి ఉంటుంది. దీంతో కొత్త రైళ్లు రావడానికి ప్లాట్‌ఫాంలు అందుబాటులో ఉండవు. ఫలితంగా విశాఖ వచ్చే రైళ్లన్నీ స్టేషన్ బయటే గంటల తరబడి నిలిచిపోతున్నాయి. ఈ సమస్యను అధిగమించేందుకే మూడో మూడో లైన్ ఏర్పాటు చేస్తామని రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది. మూడో లైన్ పూర్తయ్యాక నాలుగో లైన్ కూడా నిర్మాణం చేపడతామని స్పష్టం చేసింది. అందుకే ఈ రెండు లైన్ల నిర్మాణానికి వేర్వేరు దశల్లో నిధులు మంజూరు చేసింది.
కొలిక్కి వచ్చిన భూసేకరణ
ఈ రెండు లైన్ల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియ విడతల వారీగా సాగింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో రైల్వే స్టేషన్ సమీపంలోని బ్లాక్ నం.7లోని 15,150 నంబర్ల మధ్య 10,333 చదరపు అడుగుల భూమి అవసరమని గుర్తించి, అభ్యంతరాల స్వీకరణకు నోటీసులు జారీ చేశారు. ప్రజల నుంచి ఎలాంటి అభ్యంతరాలు రాకపోవడంతో, భూసేకరణకు మార్గం సుగమమైంది. దీంతో ఇకపై పనులు వేగంగా జరుగుతాయని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా, 8 కిలోమీటర్ల మేర పూర్తిస్థాయి ఆటోమేటిక్ సిగ్నలింగ్ వ్యవస్థతో పాటు విద్యుదీకరణ పనులు కూడా చేపట్టనున్నారు.
పూర్తయితే ప్రయాణం సాఫీ
ఈ రెండు లైన్లు పూర్తయితే విశాఖపట్నం–దువ్వాడ–సింహాచలం మధ్య రైళ్ల రాకపోకలు వేగవంతం అవుతాయి. స్టేషన్‌లో రైళ్లు నిలిచిపోయే సమయం తగ్గి, ప్రయాణికులకు ఆటంకాలు తొలగిపోతాయి. ఇప్పటికే సింహాచలం–గోపాలపట్నం–విశాఖపట్నం, దువ్వాడ–గోపాలపట్నం మధ్య ఆటోమేటిక్ సిగ్నలింగ్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. ఈ మూడో, నాలుగో లైన్లు కూడా పూర్తయితే, స్టేషన్ బయట గంటల తరబడి రైళ్లు ఆగాల్సిన అవసరం ఉండదని, ఈ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.
అధికారుల నిర్లక్ష్యం..
దశాబ్ద కాలం గడుస్తున్నా మూడో లైన్ పూర్తి కాకపోవడానికి ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ అధికారుల నిర్లక్ష్యమే కారణమని వాల్తేరు రైల్వే వర్గాలు ఆరోపిస్తున్నాయి. పనుల పర్యవేక్షణ కొరవడటంతో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఎప్పుడైనా జోన్ అధికారులు పనుల పరిశీలనకు వస్తారని తెలిస్తే.. ముందుగానే కాంట్రాక్టర్లకు సమాచారం ఇస్తున్నట్లు సమాచారం. దీంతో తనిఖీలకు ముందు రోజు మాత్రమే పనులు మొదలుపెడుతున్నారని, వారు వెళ్లగానే మళ్లీ పనులు ఆపేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీని వల్ల కాంట్రాక్టర్లు ఆడిందే ఆటగా, పాడిందే పాటగా మారింది. థర్డ్‌లైన్ తర్వాత పలు జోన్ల పరిధిలో వచ్చిన ప్రతిపాదనలకు సంబంధించి పనులు చురుగ్గా సాగుతున్నా.. ఇక్కడ మాత్రం ‘ఎక్కడ వేసిన గొంగళి’అన్న చందంగా పరిస్థితి తయారైంది.
నత్తనడకన పనులు
విశాఖపట్నం నుంచి గోపాలపట్నం వరకు సుమారు 8 కిలోమీటర్ల మేర మూడో రైల్వే లైన్‌ను నిర్మించాలని 2015–16లో నిర్ణయించారు. 2017–18 బడ్జెట్‌లో సర్వే కోసం నిధులు కేటాయించగా, అది పూర్తి కావడానికి ఏళ్లు పట్టింది. సర్వే పూర్తయ్యాక, ఆరేళ్ల కిందట ఆధునిక మూడో లైన్ నిర్మాణానికి రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది. ఆ తర్వాత 2022లో నాలుగో లైన్ నిర్మాణానికి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చింది. అప్పటి డీఆర్‌ఎం అనూప్ కుమార్ సత్పతి చొరవతో ఈ ప్రతిపాదనకు రైల్వే బోర్డు వెంటనే ఆమోదముద్ర వేసింది. మొత్తం 15.31 కిలోమీటర్ల మేర ట్రాక్, ఇతర మౌలిక సదుపాయాల కోసం రూ.159.47 కోట్లు మంజూరు చేసింది. 2021–22లో మూడో లైన్ పనులు, ఈ ఏడాది నాలుగో లైన్ పనులు ప్రారంభమయ్యాయి. కానీ.. ఇప్పటివరకు మూడో లైన్ పనులు 50 శాతం కూడా పూర్తి కాలేదు.

నిర్మాణంలో జాప్యం.. నిత్యం నరకం

నిర్మాణంలో జాప్యం.. నిత్యం నరకం

నిర్మాణంలో జాప్యం.. నిత్యం నరకం