‘నారాయణ’ మంత్రాంగంలో మేయర్ గల్లంతు!
తీసేసిన కరివేపాకేనా..
నగర ప్రథమ పౌరుడిగా గౌరవం అందుకోవాల్సిన గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌కు సొంత ప్రభుత్వం నుంచే అవమానం ఎదురైంది. సాక్షాత్తు చంద్రబాబు సర్కార్‌లోని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ నిర్వహించిన కీలక సమీక్షా సమా వేశంలో మేయర్‌కు చోటు దక్కకపోవడం గమనార్హం. నగర అభివృద్ధికి సంబంధించి అత్యంత ప్రాధాన్యత ఉన్న ఈ భేటీలో మేయర్‌ను పక్కన పెట్టడం ద్వారా ఆయనను ‘చారులో కరివేపాకు’లా తీసిపారేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. –డాబాగార్డెన్స్
విశాఖ పర్యటనకు ఆదివారం వచ్చిన మంత్రి నారాయణ, నగరంలోని బీచ్‌రోడ్డులో ఉన్న స్మార్ట్‌సిటీ కార్యాలయంలో ఒక రహస్య సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్‌తో పాటు అభివృద్ధి పనులకు సంబంధించిన ముఖ్య అధికారులు మాత్రమే పాల్గొన్నారు. ప్రస్తుతం నగరంలో కొనసాగుతున్న ప్రాజెక్టుల పురోగతి, భవిష్యత్ ప్రణాళికలు, మురుగునీటి పారుదల వ్యవస్థ పనితీరు వంటి కీలక అంశాలపై ఇక్కడ సుదీర్ఘంగా చర్చించారు. అయితే నగర పాలక సంస్థకు అధిపతిగా ఉన్న మేయర్ పీలా శ్రీనివాసరావుకు ఈ సమావేశానికి సంబంధించి సమాచారం లేకపోవడం లేదా ఆయనను ఉద్దేశపూర్వకంగానే ఆహ్వానించకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇది అధికార పార్టీ నాయకులకు, మేయర్‌కు మధ్య ఉన్న అంతర్గత విభేదాలను మరోసారి బహిర్గతం చేసింది.
సమావేశం అక్కడెందుకో?
మరోవైపు ఈ సమావేశం జరిగిన వేదికపై కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దేశవ్యాప్తంగా స్మార్ట్‌సిటీ కార్పొరేషన్లను ఎత్తివేసి నెలలు గడుస్తోంది. విశాఖలో కూడా ఈ విభాగం ఉనికిలో లేదు. సమీక్షల కోసం జీవీఎంసీ, వీఎంఆర్‌డీఏ వంటి ప్రతిష్టాత్మక భవనాలు అందుబాటులో ఉండగా, మూతపడిన స్మార్ట్‌సిటీ కార్యాలయాన్ని ఎంచుకోవడం వెనుక ఆంతర్యమేమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. అక్కడ పనిచేస్తున్న ఒక అధికారి ప్రయోజనాల కోసమే ఈ వేదికను ఎంచుకున్నారని, సదరు అధికారి కనుసన్నల్లోనే మంత్రి ఈ సమీక్ష నిర్వహించారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఆ అధికారి చెబుతున్న మాటలకు మంత్రి తలొగ్గడం ఇక్కడ కొసమెరుపు.
ఆ ప్రాజెక్టు కోసమేనా..
భీమిలి నియోజకవర్గ పరిధిలోని మధురవాడలో సుమారు రూ.500 కోట్ల వ్యయంతో చేపట్టిన మురుగునీటి ప్రాజెక్టు, దాని అనుబంధ పనుల గురించే ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. గతంలో కూడా మంత్రి నారాయణ ఇదే ప్రాజెక్టుపై ప్రత్యేకంగా దృష్టి సారించడం చూస్తుంటే, దీని వెనుక ఏదో పెద్ద భాగోతమే ఉందన్న ప్రచారం సాగుతోంది. మొత్తానికి ఈ ‘రహస్య సమీక్ష’ విశాఖ రాజకీయాల్లో మేయర్ వర్సెస్ మంత్రిగా రూపాంతరం చెంది, కొత్త సమీకరణాలకు తెరలేపింది.
మేయర్‌ను పిలవలేదా?
పిలిచినా వెళ్లలేదా?
ఈ వ్యవహారంపై నగరంలోని పలు పార్టీల నాయకులు, కార్పొరేటర్లు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. మంత్రి, మేయర్‌కు మధ్య నెలకొన్న ఈ సమన్వయ లోపం నగర ఆధునీకరణపై ప్రతికూల ప్రభావం చూపుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. అసలు మేయర్‌ను మంత్రి పిలవలేదా? లేక పిలిచినా ఆయన హాజరు కాలేదా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నప్పటికీ, ఒక అధికారిక సమీక్షలో ప్రోటోకాల్ పాటించకపోవడాన్ని విపక్షాలు తప్పుబడుతున్నాయి.
‘నారాయణ’ మంత్రాంగంలో మేయర్ గల్లంతు!


