పాలవలస కుటుంబానికి మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శ
వైఎస్సార్ సీపీ అధినేతకు అపూర్వ ఆదరణ
హెలిప్యాడ్ నుంచి పాలవలస ఇంటి వరకూ వెంటసాగిన అభిమానులు
సాక్షి, పార్వతీపురం మన్యం/పాలకొండ/పాలకొండ రూరల్: అభిమానం ఎక్కడికీ పోలేదు.. మమకారం ఇసుమంతైనా తగ్గలేదు.. ఆప్యాయత అణువంతైనా మారలేదు. మన్యం ప్రజలకు, వైఎస్సార్ సీపీ అధినేత వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డికి మధ్య విడదీయరాని అనుబంధం పాలకొండ సాక్షిగా గురువారం నిరూపితమైంది. జగన్‌మోహన్ రెడ్డిపై తమ గుండెల్లో గూడు కట్టుకుని ఉన్న మమకారం ఆయన పర్యటనలో కనిపించింది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు పాలవలస రాజశేఖరం కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన జగన్‌మోహన్‌రెడ్డిని చూసేందుకు, కలిసేందుకు పార్టీ శ్రేణులు, అభిమానులు భారీగా తరలివచ్చారు. పాలకొండ రహదారులన్నీ జనసంద్రంగా మారాయి.
అడుగడుగునా అభిమాన వర్షం..
వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు పాలవలస రాజశేఖరం(81) ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబాన్ని జగన్ మోహన్రెడ్డి పరామర్శించారు. ఉదయం తాడేపల్లి నుంచి బయల్దేరిన ఆయన... విశాఖ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో వీరఘట్టం రోడ్డులో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు మధ్యాహ్నం 2 గంటల సమయంలో చేరుకున్నారు.
ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన నాయకులు ఆయనకు అక్కడ ఘనస్వాగతం పలికారు. అనంతరం భారీ వాహన శ్రేణి వెంట రాగా.. రోడ్డు మార్గంలో రాజాం జంక్షన్, కోటదుర్గ జంక్షన్ గుడి, ఆర్టీసీ కాంప్లెక్స్ మీదుగా పాలకొండలోని పాలవలస ఇంటికి చేరుకున్నారు. దారి పొడవునా అభిమానులకు అభివాదం చేసుకుంటూ ఆయన ముందుకు సాగారు. దాదాపు మూడు కిలోమీటర్ల మేర అభిమానులు ద్విచక్ర వాహనాలతో ఆయన వెంట హుషారుగా కదిలారు. మార్గమధ్యంలో పూల వర్షం కురిపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండడం వల్ల జగన్ ఎక్కడా వాహనం దిగనప్పటికీ... మధ్యమధ్యలో ప్రజల అభిమానంతో కారు మీద నుంచే ఆగి, అభివాదం చేసుకుంటూ వెళ్లారు.
పాలవలస ఇంటి వద్ద మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని కలిసిన మాజీ ఎమ్మెల్యేలు బొత్స అప్పలనరసయ్య, కడుబండి శ్రీనివాసరావు, శంబంగి వెంకట చిన అప్పలనాయుడు.
Comments
Please login to add a commentAdd a comment