వివాహిత మృతిపై కుటుంబ సభ్యుల అనుమానం
నెల్లిమర్ల రూరల్: మండలంలోని నీలంరాజు పేటకు చెందిన వివాహిత దేవిప్రియ(21) విజయనగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో శుక్రవారం మృతి చెందిన ఘటనపై మృతురాలి కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై స్థానిక పోలీసులు తెలిపిన వివరాల మేరకు గుర్ల మండలం కెల్ల గ్రామానికి చెందిన దేవిప్రియ, నెల్లిమర్ల మండలంలోని నీలంరాజుపేటకు చెందిన లోకనాథం నాలుగు నెలల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి విజయనగరం పట్టణంలోని పూల్‌బాగ్‌లో అద్దెఇంటిలో నివాసం ఉంటున్నారు. ఇటీవల దేవిప్రియ అనారోగ్యానికి గురికావడంతో భర్త తొలుత నెల్లిమర్ల మిమ్స్‌కు తీసుకువెళ్లాడు. ఛాతీలో నొప్పి రావడంతో మెరుగైన చికిత్స కోసం విజయనగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అయితే దహన సంస్కారాల నిమిత్తం భర్త, బంధువులు దేవి ప్రియ మృతదేహాన్ని స్వగ్రామమైన నీలంరాజుపేటకు శుక్రవారం తీసుకువచ్చారు. విషయం కాస్తా మృతురాలి తల్లిదండ్రులకు తెలియడంతో వారు నెల్లిమర్ల పోలీస్‌స్టేషన్‌కు వచ్చి తమ బిడ్డ మృతిపై అనుమానం వ్యక్తం చేశారు. అయితే ఈ ఘటన విజయనగరం పరిధిలో జరగడంతో అక్కడే ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించగా వివాహిత కుటుంబ సభ్యులు విజయనగరం టూ టౌన్ పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. కాగా నీలంరాజుపేటలో వివాహిత మృతదేహాన్ని ఏఎస్సై సతీష్, సిబ్బంది పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment