● ఇదెక్కడి తీరు?
● చెక్‌పోస్టును ఎత్తేయాలని రైతుల డిమాండ్
● సమస్యను డీడీకి నివేదిస్తానంటూ
వెనుదిరిగిన విజిలెన్స్ ఏజీ
వేపాడ: తమ మెరకపొలాల్లోని మట్టిని పల్లపు పొలాల్లోకి తరలిస్తే సుంకం కట్టాలా..? ఇదెక్కడి పాలన..? మట్టి తరలిస్తున్న ట్రాక్టర్ల నుంచి చెక్‌పోస్టు వద్ద అక్రమ వసూళ్లకు పాల్పడడం దారుణమంటూ రైతులతో కలిసి సీఐటీయూ నాయకులు చల్లాజగన్, మద్ది రమణ, ట్రాక్టర్ల డ్రైవర్ల యూనియన్ నాయకుడు గేదెల శ్రీను, ఆందోళన చేశారు. బొద్దాం–కేజీ పూడి రోడ్డులోని చెక్‌పోస్టువద్ద వాహనాలను నిలిపి సోమవారం ధర్నా చేశారు. దీనిపై స్పందించిన మైనింగ్ అండ్ విజిలెన్స్ ఏజీ ఎస్.పి.కె.మల్లేశ్వరరావుకు చెక్‌పోస్టు వద్దకు చేరుకున్నారు. రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా చెక్‌పోస్టు సిబ్బంది తీరు, అక్రమ వసూళ్లను రైతులు, సీఐటీయూ నాయకులు ఆయనకు వివరించారు. రైతువారీ పనుల్లో భాగంగా మట్టి, పిక్క, కంకరవంటివి తరలిస్తుంటే వేలల్లో డబ్బులు చెల్లించాలని చెక్‌పోస్టు సిబ్బంది ఇబ్బందులు పెడుతున్నారన్నారు. రాష్ట్రంలో ఎక్కడాలేని చెక్ పోస్టులు మూడు జిల్లాల్లో పెట్టారని, శ్రీకాకుళం జిల్లాలో రైతువారీ పనులకు వినియోగించే వాహనాలకు వెసులబాటు కల్పించారని చెప్పారు. ఇక్కడ మాత్రం ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు. దీనిపై స్పందించిన విజిలెన్స్ ఏజీ సమస్యను డీడీ దృష్టికి తీసుకెళ్తానని చెప్పి వెనుదిరిగారు. సమస్యను పరిష్కరించేవరకు ఆందోళన కొనసాగిస్తామని సీఐటీయూ నాయకులు స్పష్టంచేశారు. కార్యక్రమంలో చలుమూరి శ్యామ్, చెల్లికాని ముత్యాలు, గేదెల శ్రీను, తూర్పాటి సతీష్, జనపరెడ్డి శ్రీను, పట్రాన కృష్ణ, దళాయి శివ, అలమండ శివప్రసాద్, మజ్జి గంగరాజు, ద్వారపూడి కృష్ణ, తదితరులు పాల్గొన్నారు. వల్లంపూడి ఎస్‌ఐ బి.దేవీ తన సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.


