విజయనగరం అర్బన్: ఉమ్మడి విజయనగరం జిల్లాలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాల/కళాశాలలో 2025–26 విద్యా సంవత్సరానికి 5వ తరగతి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు వచ్చేనెల 6న నిర్వహించనున్న ప్రవేశ పరీక్షను వాయిదా వేసినట్టు గురుకులాల సమన్వయకర్త శంబాన రూపవతి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షను ఏప్రిల్ 13వ తేదీన నిర్వహిస్తామని, దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు గమనించాలని కోరారు. హాల్ టికెట్‌లను ‘ఏపీబీఆర్‌ఏజీసెట్.ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్.ఐఎన్’ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. ఆ రోజు ఉదయం 10 నుంచి 12 గంటల వరకు ఐదో తరగతికి, మధ్యాహ్నం 2 నుంచి 4.30 గంటల వరకు ఇంటర్మీడియట్‌లో ప్రవేశాలకు పరీక్ష నిర్వహిస్తామని చెప్పారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్‌టికెట్‌తో పాటు ఆధార్ కార్డు, బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్ తీసుకొని రావాలని కోరారు. డాక్టర్ బీఆర్‌అంబేద్కర్ గురుకుల పాఠశాల/కళాశాలలు విజయనగరం జిల్లాలో 8, పార్వతీపురం మన్యం జిల్లాలో 5 ఉన్నాయని పేర్కొన్నారు.
శంబాన రూపవతి, ఉమ్మడి
విజయనగరం జిల్లా
సమన్వయకర్త


