విజయనగరం:
విజయనగరంలో వర్షపు నీరు నిల్వ ఉండే నిర్మాణాల కోసం కేంద్ర ప్రభుత్వం తొలివిడత (50 శాతం)గా రూ.24.86లక్షలు మంజూరు చేసింది. సంబంధిత నిధులు మంజూరు పత్రాన్ని భారత గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులు బుధవారం న్యూఢిల్లీలో విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ పల్లి నల్లనయ్యకు అందజేశారు. షాలో అక్విఫెర్ మేనేజ్మెంట్ ప్రాజెక్టు కింద దేశవ్యాప్తంగా 75 నగరాలను గుర్తించగా అందులో విజయనగరం ఒకటి. అమృత్ 2.0 పథకం కింద 10 అర్బన్ అక్విఫెర్ ఫర్ సస్టైనబుల్ మ్యాపింగ్ కింద విజయనగరం నగరపాలక సంస్థ అర్హత సాధించిందని కమిషనర్ పల్లి నల్లనయ్య తెలిపారు. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ హైదరాబాద్ వారిచ్చిన 10 ప్రాంతాలలో వర్షపు నీటి కట్టడాలను ఏర్పాటుకు రూ.49.72 లక్షలు అంచనాలను పట్టణాభివృద్ధి వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సమర్పించామన్నారు. ఎంపిక చేసిన పది ప్రాంతాలలో నిర్మాణాలు చేపట్టేందుకు ఆ శాఖ ఆమోదం తెలుపుతూ నిధులు మంజూరు చేసిందన్నారు.
త్వరలో విజయనగరం నగరపాలక సంస్థ బ్యాంకు ఖాతాకు నిధులు జమవుతాయన్నారు. త్వరలో 10 వర్షపు నీటి కట్టడాలకు టెండర్లు పిలిచి వర్షాకాలం రాకముందే వాటి నిర్మాణ పనులు పూర్తి చేస్తామని ఓ ప్రకటనలో తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో డీఈ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
తొలివిడతగా రూ.24.86 లక్షలు
మంజూరు చేసిన కేంద్రం
న్యూఢిల్లీలో కార్పొరేషన్ కమిషనర్‌కు నిధుల మంజూరుపత్రం అందజేత


