పార్వతీపురంటౌన్: బలహీన వర్గాలకు చెందిన మత్స్యకారులకు సీడ్ బిల్లుల చెల్లింపులో పార్వతీపురం మన్యం జిల్లా మత్స్యశాఖాధికారి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖాధికారులకు బుధవారం పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. పాలకొండ మండలం టీడీ పురానికి చెందిన బొప్పన అప్పన్నదొరకు చెందిన కోటదుర్గ ఫిష్ సీడ్ సంస్థలోని విత్తన నిల్వలను తనిఖీ చేసి, రూ.60 లక్షల బిల్లు మంజూరు చేసినందుకు జిల్లా మత్స్యశాఖాధికారి వేముల తిరుపతయ్య రూ.60 వేలు డిమాండ్ చేశారు. బాధితుడు అప్పన్నదొరకు లంచం ఇవ్వడం ఇష్టంలేక విజయనగరంలోని ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో వలపన్నాం. బాధితుడి నుంచి పార్వతీపురంలోని మత్స్యశాఖ కార్యాలయంలో రూ.60 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నాం. ఆయనపై కేసు సమోదు చేసి, డబ్బులు సీజ్ చేశాం. నిందితుడిని విశాఖపట్టణంలోని ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ డీఎస్పీ తెలిపారు. దాడిలో సీఐలు మహేశ్వరరావు, భాస్కరరావు, సిబ్బంది పాల్గొన్నారు.
సీడ్ ఏజెన్సీకి బిల్లులు చెల్లించినందుకు రూ.60 వేలు డిమాండ్
ఏసీబీ అధికారులను ఆశ్రయించిన ఏజెన్సీ నిర్వాహకుడు
వలపన్ని పట్టుకున్న అధికారులు
ఏసీబీ వలకు చిక్కిన మత్స్యశాఖాధికారి


