విజయనగరం అర్బన్: ఈ నెల 31వ తేదీ జరగాల్సిన పదో తరగతి సాంఘిక శాస్త్ర సబ్జెక్టు పరీక్ష రంజాన్ పండగ కారణంగా వచ్చేనెల 1వ తేదీన నిర్వహిస్తామని డీఈఓ యు.మాణిక్యంనాయుడు తెలిపారు. ప్రభుత్వ పరీక్షల విభా గం సంచాలకుల ఆదేశాల మేరకు ఈ మార్పు జరిగిందని తెలిపారు. ఇంతవరకు జరిగిన పరీక్షల మాదిరిగానే ఉదయం 09.30 గంటల నుంచి 12.45 గంటల మధ్య సమయంలోనే నిర్వహిస్తామని తెలిపారు. పరీక్షల సిబ్బంది, అన్ని యాజమాన్యాల ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు ఈ మార్పును గమనించాలని సూచించారు.
30, 31న యథావిధిగా రిజిస్ట్రేషన్ సేవలు
విజయనగరం రూరల్: జిల్లాలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ నెల 30న ఉగాది, 31న రంజాన్ పండగల్లో సైతం రిజిస్ట్రేషన్ సేవలు యథావిధిగా అందజేస్తామని జిల్లా రిజిస్ట్రార్ పి.రామలక్ష్మిపట్నాయక్ శుక్రవారం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ అడిషనల్ ఐజీ ఉదయభాస్కర్ ఆదేశాలు జారీచేశారన్నారు. ఆ రెండు రోజులు సెలవు దినాల నుంచి మినహాయింపు ఇచ్చామన్నారు. డీఐజీ, జిల్లా రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పనిచేస్తాయని తెలిపారు. సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
నేడు పతంజలి సాహిత్య పురస్కారం ప్రదానం
విజయనగరం టౌన్: ప్రముఖ పాత్రికేయుడు, రచయిత తాడిప్రకాష్‌కు పతంజలి సాహిత్య పురస్కారాన్ని శనివారం ప్రదానం చేస్తామని పతంజలి సాంస్కృతిక వేదిక కార్యదర్శి ఎన్.కె.బాబు ఓ ప్రకటనలో తెలిపారు. గురజాడ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో సాయంత్రం 6 గంటల నుంచి పురస్కార సభ జరుగుతుందని, సాహితీవేత్తలు, అభిమానులు హాజరుకావాలని కోరారు.
గిరిజన బాలికల ఆశ్రమ
పాఠశాలల ఏర్పాటుకు వినతి
విజయనగరం అర్బన్: ఉమ్మడి విజయనగరం జిల్లాలో గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను అదనంగా ఏర్పాటుచేసేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డీవీజీ శంకరావుకు ఉపాధ్యాయులు శుక్రవారం వినతి పత్రం అందజేశారు. జిల్లాలో గిరిజన బాలికల కోసం కేవలం రెండే రెండు ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయన్నారు. దీనివల్ల ఆ పాఠశాలల్లో ఉన్న సీట్లు భర్తీ అయిపోతే చదువుకోవాలనుకుంటున్న బాలికలు విద్యకు దూరమవుతున్నారని తెలియజేశారు. వినతిని స్వీకరించిన చైర్మన్ డాక్టర్ డీవీజీ శంకరావు మాట్లాడుతూ విద్య ప్రాథమిక హక్కు అని, పిల్లలు అందరూ చదువుకునేలా చూడాల్సి బాధ్యత అందరి మీదా ఉందన్నారు. జిల్లాలోని సమస్యను ప్రభుత్వానికి నివేదించి పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు.
31న గ్రీవెన్స్ రద్దు
విజయనగరం అర్బన్: రంజాన్ సందర్భంగా ఈ నెల 31వ తేదీ సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించనున్న ప్రజావినతుల పరిష్కార వేదిక (గ్రీవెన్స్)ను రద్దు చేస్తున్నామని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు గమనించాలని సూచించారు.
మత్య్సశాఖ డీడీకి ఉద్యోగోన్నతి
విజయనగరం ఫోర్ట్: మత్య్సశాఖ డిప్యూటీ డైరెక్టర్ నేతల నిర్మలకుమారి మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్‌గా ఉద్యోగోన్నతిపై రాజమండ్రికి బదిలీ అయ్యారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు.
జాతీయ స్థాయి గుర్తింపు
గజపతినగరం: పురిటిపెంట–2 ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రానికి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిందని మరుపల్లి పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్ సాయికృష్ణారెడ్డి తెలిపారు. కేంద్రం సిబ్బందిని శుక్రవారం అభినందించారు. రోగులకు సంతృప్తికర వైద్యసేవలు, మౌలిక సదుపాయాలు, అవసరమైన మందుల నిల్వలు, పరిశుభ్రత తదితర అంశాల ఆధారంగా కేంద్రానికి జాతీయ స్థాయి గుర్తింపు వచ్చినట్టు తెలిపారు. ఎమ్‌ఎల్‌హెచ్‌పి ఎం.సంతోషి, ఏఎన్‌ఎం ఎ.సత్యవతి సేవలను కొనియాడారు.


