పేదల భూములు
లాక్కునేందుకు
బొబ్బిలి: మాది బీసీ ప్రభుత్వం అంటూ ప్రచారం చేసుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడూ.. నిరుపేద బీసీలకు చెందిన భూములను లాక్కోవడానికి సిగ్గులేదా..? డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ నీకూ సిగ్గులేదా.. మీకు పేదలు అర్జీ పెట్టుకున్నా కనిపించలేదా? అంటూ రాజమండ్రి మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి హర్షకుమార్ దుయ్యబట్టారు. ఆయన విజయనగరం జిల్లా బొబ్బిలిలో విలేకరులతో శుక్రవారం మాట్లాడారు. భూ పరిమితి చట్టం కింద రాజుల నుంచి ఏళ్ల కిందట స్వాధీనం చేసుకున్న భూమిని 1991 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం ఒక్కో పేద కుటుంబానికి ఎకరా చొప్పున ఇచ్చిందన్నారు. ఆ భూముల్లో సాగుచేసిన పంటలే వారికి జీవనాధారమని పేర్కొన్నారు. ఇప్పుడు బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన తన అధికార బలంతో మళ్లీ వాటిని లాక్కున్నారని, సర్వే నంబర్లు మార్చేసి రియల్ ఎస్టేట్ వెంచర్లుగా వేసి అమ్ముకోవడం దుర్మార్గమన్నారు. ముందుగా బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనా యన వేసిన రియల్ ఎస్టేట్ వెంచర్ ప్రాంతాన్ని పరిశీలించి బాధిత రైతులతో మాట్లాడి ఓదార్చారు. అండగా ఉంటామన్నారు.
రజక తదితర బీసీ కులస్తులకు గతంలో ప్రభుత్వం అధికారికంగా ఇచ్చిన భూములను తిరిగి లాక్కోవడాన్ని చంద్రబాబు నాయుడు సమర్థిస్తున్నారన్నారు. అన్యాయాలు, అక్రమాలకు పాల్పడిన వారి తాట తీస్తానన్న చంద్రబాబు ఇప్పుడు బొబ్బిలి ఎమ్మెల్యే తాట తీయడం లేదేమని ఆయన ప్రశ్నించారు. బొబ్బిలిలో భూమాయ చూసిన ప్రజలకు టీడీపీ అధికారంలోకి వస్తే ఇలాగే ఉంటుందని బాగా అర్ధమవుతోందన్నారు. ఇది అన్యాయం.. అక్రమమన్నారు. వెంటనే పేదల భూములను వదిలి వెళ్లిపోవాలని , లేకుంటే ఇక్కడ నుంచి పేదల తరఫున పోరాడుతానని చెప్పారు. ఆయన వెంట బొబ్బిలి కాంగ్రెస్‌పార్టీ ఇన్‌చార్జి మువ్వల వెంకటరమణ, సీపీఐ జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ, భూ బాధితులు ఉన్నారు.
మాజీ ఎంపీ హర్షకుమార్


