ఆక్రమణల తొలగింపులో ఉద్రిక్తత
సంతకవిటి: మండలంలోని అప్పలాగ్రహారం గ్రామంలో ఆక్రమణల తొలగింపు ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీస్ బలగాల నడుమ మండలాధికారులు ఆక్రమణలను తొలగించారు. వివరాల్లోకి వెళ్తే... గ్రామంలోని కాలువ గట్టును అనుసరించి ఉన్న గ్రామకంఠంను అదే గ్రామానికి చెందిన పిన్నింటి లచ్చయ్య, కుటుంబ సభ్యులు ఆక్రమించారు. దీనిపై గ్రామస్తులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు తహసీల్దార్ సత్యం, ఎంపీడీఓ సురేష్‌కుమార్, రెవెన్యూ సిబ్బంది ఆక్రమణల తొలగింపునకు మంగళవారం వచ్చారు. ఆక్రమణదారుకు ఇదివరకే పంపించిన నోటీస్‌ను చూపించారు. గడువు ముగిసినా ఆక్రమణలు తొలగించక పోవడంపై ప్రశ్నించారు. జేసీబీతో అధికారులే దగ్గరుండి ఆక్రమణలు తొలగించేందుకు సమాయత్తమయ్యారు. ఈ సమయంలో ఆక్రమణదారు, కుటుంబ సభ్యులు ఒక్కసారి అధికారులపై తిరగబడ్డారు. వెంటనే అధికారులు పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్‌ఐ ఆర్.గోపాలరావు, రేగిడి ఎస్‌ఐ పి.నీలావతి, పోలీస్ బలగాలు గ్రామానికి చేరుకున్నాయి. భారీపోలీస్ బందోబస్తు మధ్య ఆక్రమణలు తొలగించారు. గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ పికెట్‌ను ఏర్పాటు చేసినట్టు ఎస్‌ఐ ఆర్.గోపాలరావు తెలిపారు.
రెవెన్యూ సిబ్బంది అలసత్వంతోనే..
రెవెన్యూ సిబ్బంది అలసత్వంతోనే పరిస్థితి ఇంతవరకు వచ్చిందని గ్రామస్తులు పలువురు ఆరోపిస్తున్నారు. ఆక్రమణల ప్రారంభంలోనే ఫిర్యాదు చేసినా రెవెన్యూ సిబ్బంది స్పందించలేదని వాపోయారు. రెండు రోజుల కిందట జిల్లా స్థాయి అధికారులను ఆశ్రయించడంతో అధికారుల్లో చలనం వచ్చిందన్నారు.
భారీ పోలీస్ బందోబస్తు నడుమ
అప్పలాగ్రహారంలో ఆక్రమణల
తొలగింపు
ఆక్రమణల తొలగింపులో ఉద్రిక్తత


