ఇది ముమ్మాటికీ అధికారుల వైఫల్యమే..
బొబ్బిలిరూరల్: మండలంలోని గోపాలరాయుడుపేట పంచాయతీలోని బట్టివలస ప్రాథమిక పాఠశాలకు భవన సదుపాయం లేకపోవడం, ఓ చర్చిలో తరగతుల నిర్వహణపై ఈ నెల 1వ తేదీన ‘నమ్మండి ఇదే మా పాఠశాల’ శీర్షికన ‘సాక్షి’లో వచ్చిన కథనానికి యూటీఎఫ్ నాయకులు స్పందించారు. పాఠశాలను గురువారం సందర్శించారు. విద్యార్థుల చదువు కష్టాలపై చలించిపోయారు. అనంతరం యూటీఎఫ్ రాష్ట్ర నాయకురాలు విజయగౌరి మాట్లాడుతూ ఇది ముమ్మాటికీ అధికారుల నిర్లక్ష్యమేనన్నారు. అటు రాష్ట్రప్రభుత్వం, సోషల్ వెల్ఫేర్ శాఖలు, ఐటీడీఏ శాఖల అధికారుల పట్టించుకోక పోవడమే ఈ రోజు గిరిజన విద్యార్థుల పాట్లుకు కారణమన్నారు. 2019 నుంచి ఇక్కడ పాఠశాల కావాలంటూ గిరిజనులు అనేక పర్యాయాలు స్థానిక అధికారులకు విన్నవించారన్నారు. అధికారుల స్పందన లేకపోవడంతో ప్రజలే పూరిపాకను నిర్మించుకుని, పాఠాలు చెప్పే టీచర్ కావాలని నాటి ఐటీడీఏ అధికారులను కోరగా డిప్యుటేషన్‌పై ఓ టీచర్‌ను నియమించారని పేర్కొన్నారు. శాశ్వత భవన నిర్మాణానికి హామీ ఇచ్చి ఆరేళ్లయినా సంబంధిత శాఖాధికారులు పట్టించుకోలేదన్నారు. విద్యాశాఖ, ఐటీడీఏ అధికారులు తక్షణమే స్పందించి పాఠశాలకు భవనాన్ని నిర్మించాలని కోరారు. లేదంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో యూటీఎఫ్ సహాధ్యక్షులు ప్రసన్నకుమార్, మహేష్, కృష్ణదాస్, సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.
సాక్షి కథనానికి చలించిన యుటీఎఫ్
బృందం
బట్టివలస గిరిజన గ్రామ పాఠశాల
సందర్శన
ఇది ముమ్మాటికీ అధికారుల వైఫల్యమే..


