రెడ్‌బుక్ పేరుతో వేధింపులు తగవు
రేగిడి: రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రెడ్ బుక్ పేరుతో బెదిరించడం తగదని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, రాజాం నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ తలే రాజేష్ అన్నారు. ప్రజాప్రతినిధిగా పాలన చేయాలే తప్ప అధికారులను రెడ్‌బుక్ పేరుతో బెదిరించి పనులు చేయించుకోవాలనుకోవడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. రేగిడిలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈ నెల 2న కనిగిరిలో సీబీజీ రిలయెన్స్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమం సందర్భంగా మంత్రి లోకేశ్ చేసిన వ్యాఖ్యలు నిరంకుశత్వ పాలనను ఎత్తిచూపుతున్నాయన్నారు. ఆయన తీరుచూస్తే ప్రజాప్రతినిధిగా వ్యవహరించడంలేదన్నది స్పష్టమవుతోందన్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి రెడ్‌బుక్ పేరుతో బెదిరింపులకు దిగడం సమంజసం కాదన్నారు. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌కు బ్రాండ్ అని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని, ఆయన టీడీపీకి మాత్రమే అధ్యక్షుడన్నది గుర్తించాలన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి ఒక్క చంద్రబాబే కారణమని గొప్పలుచెప్పుకుంటున్నారని, అటువంటి హైదరాబాద్‌లో టీడీపీ తరఫున ఎన్నికల్లో నిలబడేందుకు అభ్యర్థులు ముందుకు ఎందుకు రావడంలేదో లోకేశ్ చెప్పాలని అన్నారు. తండ్రీ కొడుకులు గొప్పలను పక్కనపెట్టి ఎన్నికల సమయంలో ప్రజలికిచ్చిన హామీల అమలుపై దృష్టిసారించాలని కోరారు. సమావేశంలో రేగిడి వైస్ ఎంపీపీలు టంకాల అచ్చెన్నాయుడు, వావిలపల్లి జగన్మోహనరావు, రాజాం టౌన్ కన్వీనర్ పాలవలస శ్రీనివాసరావు, సర్పంచ్‌లు కరణం శ్రీనివాసరావు, కెంబూరు వెంకటేశ్వరరావు, గార రమణ తదితరులు పాల్గొన్నారు.
చంద్రబాబు ఏపీకి బ్రాండ్‌కాదు
టీడీపీకి అధ్యక్షుడు మాత్రమే
ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయండి
ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్


