విద్యుత్ వాహనాలను ప్రోత్సహించాలి
విజయనగరం ఫోర్ట్: విద్యుత్ వాహనాలను ప్రోత్సహించాలని తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్) సి.ఎం.డి ఇమ్మడి ఫృద్వీతేజ్ అన్నారు. వీటీ అగ్రహారం కోర్టు ఎదురుగా తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ, వి.ఎన్.గ్లోబల్ ఎంటర్ ప్రైజస్ సంస్థ ఏర్పాటు చేసిన విద్యుత్ వాహనాల చార్జింగ్ స్టేషన్‌ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడంలో భాగంగా రాష్ట్రంలో వచ్చే ఐదేళ్లలో ఐదువేల విద్యుత్ చార్జింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేయాలన్నది లక్ష్యంగా పేర్కొన్నారు. పీఎం సూర్యఘర్‌లో భాగంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 10 వేల మంది ఎస్సీ, ఎస్టీ వర్గాల ఇళ్లకు సౌరవిద్యుత్ యూనిట్లు ఏర్పాటుచేస్తామని చెప్పారు. సంస్థ పరిధిలో ఇప్పటి వరకు 7,800 సూర్యఘర్ యూనిట్లను ఏర్పాటు చేయగా, విజయనగరం జిల్లాలో 700 యూనిట్లు ఏర్పాటు చేశామన్నారు. కొత్త సబ్‌స్టేషన్ల ఏర్పాటు, లోడ్ అధికంగా ఉన్న చోట అదనపు ట్రాన్సఫార్మర్లు, ఫీడర్ల విభజనతో వేసవిలో అంతరాయం లేకుండా చేస్తామని తెలిపారు. తమ సంస్థ ఆధ్వర్యంలో 1812 విద్యుత్ కాల్ సెంటర్ మూడు షిఫ్టుల్లో 24 గంటలపాటు సేవలందించేలా చర్యలు తీసుకున్నామన్నారు. కార్యక్రమంలో ఈపీడీసీఎల్ ఫైనాన్స్ డైరెక్టర్ డి.చంద్రం, సీజీఎం జంగా శ్రీనివాస్‌రావు, ఎస్‌ఈ మువ్వల లక్ష్మణరావు, ట్రాన్స్‌కో ఎస్‌ఈ బాలాజీ, ఈఈలు పి.త్రినాథ్‌రావు, కిరణ్, మురళీ, డీఈ సురేష్‌బాబు, హరి, సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
ఈపీడీసీఎల్ సీఎండీ ఫృద్వీతేజ్
విద్యుత్ వాహనాల చార్జింగ్ స్టేషన్ ప్రారంభం


