పార్వతీపురంటౌన్: జిల్లా ప్రధాన కేంద్రంలో ఏర్పాటు కానున్న జిల్లా పంచాయతీ వనరుల కేంద్రాన్ని వీలైనంత త్వరగా పూర్తిచేసి సిద్ధం చేయాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. ఈ మేరకు స్థానిక రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయం పక్కన రూ.200 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించనున్న జిల్లా పంచాయతీ వనరుల కేంద్రం స్థలాన్ని కలెక్టర్ శుక్రవారం పరిశీలించారు. ఈ భవన నిర్మాణం పూర్తయితే జిల్లాలో వివిధ రకాల శిక్షణ కార్యక్రమాలు చేపట్టేందుకు వీలుగా ఉంటుందని, అదేవిధంగా ఇతర ప్రభుత్వ కార్యకలాపాలను నిర్వహించుకోవచ్చని పంచాయతీ రాజ్‌శాఖ ఇంజినీర్లకు కలెక్టర్ స్పష్టం చేశారు. అందుకే వీలైనంత త్వరగా భవన నిర్మాణ పనులను ప్రారంభించి అప్పగించాలని సూచించారు. ఏడాదిలోగా భవనం పూర్తిచేయాల్సి ఉన్నప్పటికీ, ఈ ఏడాది చివరి నాటికి భవనాన్ని నిర్మించి అందించాలని కలెక్టర్ ఆదేశించారు. తొలుత భవన నిర్మాణ స్థలాన్ని సందర్శించి, గదుల మార్కింగులను పరిశీలించిన ఆయన భవన నిర్మాణ వివరాలను సంబంధిత ఇంజినీర్లను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు పంచాయతీ రాజ్ శాఖ ఉప కార్యనిర్వాహక ఇంజినీర్ వి.సన్యాసిరావు, మండల ఇంజినీరింగ్ అధికారి గంటా చంద్రమౌళి, ఎస్‌ఎస్. లాజిస్టిక్స్ కాంట్రాక్టర్ సురేష్, ఇతర ఇంజినీరింగ్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్


