ఎంటీయూ–1121 రకం సాగుకే మొగ్గు
● ఏరువాక కేంద్రం కో ఆర్డినేటర్
డాక్టర్ కెల్ల లక్ష్మణ్
విజయనగరం ఫోర్ట్: జిల్లాలో 73 శాతం మంది రైతులు ఎంటీయూ–1121 (శ్రీధృతి) వరి రకం సాగుకే మొగ్గుచూపుతున్నట్టు ఏరువాక కేంద్రం కో ఆర్డినేటర్ డాక్టర్ కెల్ల లక్ష్మణ్ తెలిపారు. విజయనగ రం గాజులరేగ ఏరువాక కేంద్రంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొందరు రైతులు ఎంటీయూ–1121 రకానికి ప్రత్యామ్నాయ రకాలు అందించాలని వ్యవసాయ అధికారులకు విజ్ఞప్తి చేశారన్నారు. ఎంటీయూ–1224, ఎంటీయూ–1210, ఎంటీయూ– 1310, ఎంటీయూ–1321 వరి రకాలు జిల్లా నేలల కు అనుకూలమని, అధిక దిగుబడులు వస్తాయని తెలిపారు. ఎంటీయూ–1310, 1321 రకాలు మధ్యస్థ సన్న రకాలుగా పేర్కొన్నారు. ఎంటీయూ –1121 రకం ఎకరానికి 26 క్వింటాళ్ల దిగుబడి వస్తే ఎంటీయూ–1310, 1321 రకాల సాగుతో 33 క్వింటాళ్ల వరకు దిగుబడి పొందవచ్చన్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో ఎంటీయూ–1121 వరి రకం స్థానంలో ఎంటీయూ–1310, 1321, 1224 రకాలను 10 శాతం మేర సాగుకు ప్రోత్సహిస్తామన్నారు. వరిలో వెదపద్ధతే మేలని, సాగుఖర్చు ఎకరాకు రూ.7వేలు తగ్గుతుందన్నారు. వేరుశనగకు సంబంధించి కదిరి, లేపాక్షి రకం, నిత్య హరిత, విశిష్ట రకాలు జిల్లాకు అనుకూలమని పేర్కొన్నారు. మొక్కజొన్న పంటలో కత్తెర పురుగు వ్యాప్తి తగ్గిందన్నారు. పెసర పంటలో ఎల్‌బీజీ–607, 630, 574 రకాలు, మినుములో ఎల్‌బీజీ–884, 904, 932, టీబీజీ– 104, జీబీజీ–45 రకాలు పల్లాకు తెగులను తట్టుకుంటాయని తెలిపారు. సమావేశంలో ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ తేజేశ్వరావు పాల్గొన్నారు.


