వస్తారా? ముఖం చాటేస్తారా?
● ప్రజాప్రతినిధుల ముందుకు రాలేకపోతున్న కూటమి ఎమ్మెల్యేలు ● గత మూడు జెడ్పీ సమావేశాల్లో ఒకసారి మాత్రమే హాజరు ● మళ్లీ 9న జెడ్పీ సమావేశానికి ఆహ్వానం
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ప్రజాసంక్షేమం, అభివృద్ధి అంశాలతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించడానికి జెడ్పీ సమావేశాలు మంచి అవకాశం. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలే ఈ సమావేశాలకు డుమ్మా కొడుతున్నారు. మూడుసార్లు జెడ్పీ సమావేశాలు జరిగితే ఒక్కసారి మాత్రమే కొంతమంది ముఖం చూపించారు. ఇక శృంగవరపుకోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు, రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్, బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన... ఈ నలుగురూ ఒక్కసారి కూడా ఈ సమావేశాలకు హాజరుగాకపోవడం గమనార్హం. గ్రామీణ స్థాయిలో ప్రజలకు ప్రాతినిథ్యం వహించే ఎంపీపీలు, జెడ్పీటీసీలు ఈ సమావేశాల్లో ప్రజల సమస్యలపై గళం వినిపిస్తుంటారు. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు వాటిని ఏవిధంగా పరిష్కరిస్తారో చెబితే ఆ సమాచారం ప్రజలకు చేరుతుంది. కానీ అధికార టీడీపీ ఎమ్మెల్యేలకు ఆ విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉదయం లేచింది మొదలు అక్కడ అసెంబ్లీలో ప్రతిపక్షానికి సూక్తులు చెప్పే ఈ నాయకులు... క్షేత్రస్థాయిలో అంతే కీలకమైన జెడ్పీ సమావేశాలకు మాత్రం డుమ్మా కొట్టేస్తున్నారు. మళ్లీ ఈనెల 9వ తేదీన జెడ్పీ సర్వసభ్య సమావేశాలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆహ్వానాలు పంపారు. ఈసారైనా హాజరవుతారా? లేదంటే ముఖం చాటేస్తారా? అనే చర్చ నడుస్తోంది.
ప్రశ్నలు ఎదుర్కోలేకేనా?
సార్వత్రిక ఎన్నికల సమరంలో గట్టెక్కడమే లక్ష్యంగా టీడీపీ, జనసేన నాయకులు సూపర్ సిక్స్‌తో పాటు మేనిఫెస్టోలో అనేక హామీలు గుప్పించారు. అరకు ఎంపీ మినహా ఉమ్మడి విజయనగరం జిల్లాలో అన్ని అసెంబ్లీ స్థానాలు, విజయనగరం ఎంపీ టీడీపీ, జనసేన కూటమి ఖాతాలోనే చేరా యి. అంటే దాదాపుగా ఉమ్మడి జిల్లాలో ప్రజలకు మేలు చేయాల్సిన బాధ్యత వారిదే. కానీ ప్రజల్లోకి వెళ్లలేకపోతున్నారు. కేవలం సామాజిక పింఛన్ల పెంపు హామీ ఒక్కటే ఇప్పటివరకూ కూటమి ప్రభుత్వం అమలుచేసింది. మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్న హామీ కూడా ఒక్క సిలిండర్‌కే సరిపెట్టారు. ఉగాది నుంచి అమలుచేస్తామన్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తుస్సుమనిపించారు. తల్లికి వందనం ఏప్రిల్ నుంచి, రైతుభరోసా పెట్టుబడి సాయం మే నెల నుంచి అమలుచేస్తామని చెబుతున్నా బడ్జెట్‌లో నిధుల కేటాయింపు కనిపించలేదు. గ్రామాల్లో తాగునీరు, పారిశుద్ధ్యం సమస్యలు మొదలయ్యాయి. రోడ్ల మరమ్మతులు అంతంతమాత్రమే. గోకులం షెడ్‌లకు బిల్లులు ఇవ్వలేదు. మరోవైపు ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. వీటన్నింటిపై ఎంపీపీ లు, జెడ్పీటీసీలు ప్రశ్నించడానికి సిద్ధమవుతు న్నారు. వీటికి సమాధానం చెప్పడానికి కూటమి పార్టీ ప్రజాప్రతినిధులు ఈసారైనా జెడ్పీ సర్వసభ్య సమావేశాలకు హాజరుకావాలి.
ఖాళీగా ఉన్న సీట్లు (ఫైల్)
జెడ్పీ సమావేశం (ఫైల్)
జిల్లాపరిషత్‌లో కీలకమైన స్థాయీసంఘ సమావేశాలకు టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన ఎమ్మె ల్యేలు, ఎంపీ, మంత్రులను అధికారులు ఆహ్వానించారు. కానీ ఒక్కరూ హాజరుకాలేదు. సీజనల్ వ్యాధులు, రైతులకు విత్తనాల సరఫరా తదితర కీలక అంశాలపై సమీక్ష జరిగినా అధికార పార్టీ తరఫున సమాధానం చెప్పేవారే కరువయ్యారు.
సార్వత్రిక ఎన్నికల తర్వాత తొలిసారిగా జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఉమ్మ డి విజయనగరం జిల్లాకు చెందిన మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, గుమ్మడి సంధ్యారాణి, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయు డు, ఎమ్మెల్యేలు లోకం మాధవి, పూసపాటి అదితి గజపతిరాజు, తోయక జగదీశ్వరి, బోనె ల విజయచంద్ర మాత్రమే హాజరయ్యారు.
వస్తారా? ముఖం చాటేస్తారా?


