కొఠియా గ్రామాల్లో పర్యటనకు భద్రత కల్పించండి
పార్వతీపురంటౌన్: ఆంధ్రా–ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లోని వివాదాస్పద కొఠియా గ్రామాల్లో పర్యటించనున్నామని తమకు భద్రత కల్పించాలని లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బీశెట్టి బాబ్జీ కోరారు. ఈ మేరకు సోమవారం పార్వతీపురం మన్య జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివాదాస్పద కొఠియా పరిధిలో గల 21 గ్రామాల్లో ఆందోళన చెందుతున్న గిరిజనులందరికీ మద్దతుగా ఉండి పర్యటన చేపడతామని తెలిపారు. ఒడిశా ప్రభుత్వం అక్రమంగా చొరబడి గిరిజనులను భయభ్రాంతులకు గురిచేస్తోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన అంగన్వాడీ భవనాలను కూల్చివేసి దిగువ శెంబి వద్ద పవర్ ప్రాజెక్టు నిర్మిస్తోందని, దీనిని అడ్డుకున్న గిరిజనులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం మౌనంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మన రెవెన్యూ అధికారులు, వైద్య ఆరోగ్యశాఖాధికారులు, ఫారెస్టు అధికారులు, 108 వాహనాలను ఒడిశా అధికారులు, పోలీసులు వివాదాస్పద గ్రామాల్లోకి రానివ్వకపోయినా ప్రభుత్వంలో చలనం లేదని మండిపడ్డారు. కార్యక్రమంలో పౌరవేదిక ప్రధాన కార్యదర్శి జలంత్రి రామచంద్ర రాజు, కార్యదర్శి తుమ్మగంటి రామ్మోహనరావు, మాతృభూమి సేవా సంఘం కార్యదర్శి ఇప్పలవలస గోపాలరావు, గొర్లి సింహాచలం నాయుడు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్‌కు లోక్‌సత్తా వినతిపత్రం


