మిస్టర్ ఇండియా పారా విజేతకు సత్కారం
విజయనగరం: ఈ నెల 5,6 తేదీలలో ఒడిశాలోని సంబల్‌పూర్‌లో జరిగిన మిస్టర్ ఇండియా బాడీ బిల్డింగ్ పోటీల్లో పారా బిల్డర్ ఈదుబిల్లి సూర్యనారాయణ గోల్డ్ మెడల్ సాధించడం అభినందనీయమని మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు ప్రశంసించారు. ఈ మేరకు సోమవారం తన క్యాంపు కార్యాలయంలో సూర్యనారాయణను అభినందిస్తూ శాలువాతో సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మెరకముడిదాం మండలం వంగర గ్రామానికి చెందిన సూర్యనారాయణ జాతీయస్థాయిలో రాణించి మెడల్స్ సాధించడం జిల్లాకు గర్వకారణమని, భవిష్యత్‌లో మరిన్ని పతకాలు సాధించి క్రీడల్లో జిల్లా కీర్తి ప్రతిష్టలు పెంచాలని ఆకాంక్షించారు. పారా క్రీడలకు సంబంధించిన వివరాలను పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు కె.దయానంద్ మంత్రికి వివరించారు. పారా క్రీడాకారులకు సహకారం అందేలా చూస్తానని మంత్రి హామీ ఇచ్చారు.


