
సంత్ సేవాలాల్ మార్గం ఆచరణీయం
వనపర్తి: బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహరాజ్ చూపిన మార్గం ఆచరణీయమని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. శనివారం జిల్లా గిరిజన అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో నాగవరం శివారులోని సేవాలాల్ భవన్‌లో సంత్ సేవాలాల్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి గిరిజనులు తరలిరాగా.. మహిళలు తమ సాంప్రదాయ దుస్తులతో వేడుకకు హాజరయ్యారు. సేవాలాల్ మహరాజ్, మేరమయాడి దేవత మహాభోగ్ (హోమం)లో ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. జి.చిన్నారెడ్డి, లంబాడి పూజారులు రాజ్‌పవార్, బిక్షానాయక్ పాల్గొని నెయ్యి, కడావ్ ప్రసాదం వేసి నైవేద్యం సమర్పించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సేవాలాల్ అందరికీ ఆదర్శప్రాయుడని.. ఆయన జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని తెలిపారు. ఇందుకుగాను నియోజకవర్గానికి రూ.2.68 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. సేవాలాల్ ఆలయం, సేవాలాల్ భవన్‌లో వసతుల కల్పనకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. జి.చిన్నారెడ్డి మాట్లాడుతూ.. ధౌర్జన్యానికి వ్యతిరేకంగా బ్రిటిష్ వారితో పోరాటం చేసిన యోధుడు సేవాలాల్ అన్నారు. దొంగతనాలు చేయొద్దు.. మాంసాహారం తినొద్దని బోధించారని గుర్తు చేశారు. చదువుతోనే అభివృద్ధి సాధ్యమని.. ప్రతి బంజారా చదువుకు మొదటి ప్రాధాన్యం ఇచ్చి ఉన్నతవిద్య అభ్యసించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య, వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇస్తుందని.. సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లాకు ఎస్టీ గురుకుల పాఠశాల తీసుకొచ్చేందుకు కృషి చేశానన్నారు. కార్యక్రమంలో ప్రత్యేక అధికారి పి.సీతారాంనాయక్, గిరిజన అభివృద్ధి అధికారి బీరం సుబ్బారెడ్డి, శంకర్‌నాయక్, జాత్రూనాయక్, వాల్యానాయక్. మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎంపీపీ కిచ్చారెడ్డి, గిరిజన సేవాసంఘం అధ్యక్షుడు చంద్రూనాయక్, గిరిజన ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు అర్జున్‌నాయక్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు హన్మంత్‌నాయక్, వి.రాధాకృష్ణ, సూర్యానాయక్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment