సాక్షి, వరంగల్: మామునూరు ఎయిర్‌పోర్ట్ నిర్మాణం కోసం భూసర్వేను అధికారులు పూర్తిచేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి భూసేకరణే ఇప్పుడు పెద్ద టాస్క్‌గా మారే అవకాశం ఉంది. కొద్ది రోజులుగా రెవెన్యూ విభాగం సర్వే చేసింది. 253 ఎకరాల్లో క్షేత్రస్థాయిలో హద్దులు నిర్ణయించి సేకరించిన వివరాలను కలెక్టర్ డాక్టర్ సత్యశారదకు నివేదించడంతో ఇక భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేసేందుకు అడుగులు పడుతున్నాయి. దీంతో ఇప్పుడు అందరి దృష్టి ఎకరానికి ఎంత ధర చెల్లిస్తారనే అంశం వైపు మళ్లింది. ఇప్పటికే అక్కడ భూములు కోల్పోతున్న రైతులు బహిరంగ మార్కెట్ ప్రకారం ధర చెల్లించాలని, లేదంటే భూమికి బదులు భూమి ఇవ్వాలని పలుమార్లు కలెక్టర్, ఆర్డీఓకు వినతిపత్రాలు సమర్పించిన సంగతి తెలిసిందే. అలాగే, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీ కూడా బహిరంగ మార్కెట్ రేటు ప్రకారం భూనిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది. భూసేకరణ కోసం నోటిఫికేషన్ (అవార్డు పాస్ చేయడానికి) ఇచ్చే సమయంలో ధర తేలే అవకాశం ఉంది. ఎకరానికి రూ.20 లక్షలు, ఆపై చెల్లించే అవకాశముందని రెవెన్యూ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
భూసేకరణకు రూ.205 కోట్లు విడుదల..
ప్రభుత్వ నిర్ణయాన్ని రైతులు అంగీకరిస్తే అంతా మూడు నెలల్లోనే ప్రక్రియ పూర్తిచేసి ఏఏఐకి భూములు అప్పగించనున్నారు. సదరు సంస్థ విమానాశ్రయ నిర్మాణానికి టెండర్లు పిలిచి పనులు ప్రారంభించే అవకాశం ఉంది. ఈ భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.205 కోట్లను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణం కోసం చేపట్టిన భూసేకరణకు పలు అడ్డంకులు ఎదురవుతున్నాయి. మోకా మీద ఒకరు, టైటిల్ మరొకరి పేరు మీద ఉండడం, కోర్టు కేసుల్లో భూమి ఇలా వివిధ కారణాలతో భూసేకరణ పూర్తి కావడం లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని భూసేకరణకు ఎదురయ్యే ఇబ్బందులను వ్యూహాత్మకంగా అధిగమిస్తేనే మామునూరు విమానాశ్రయ నిర్మాణానికి అడుగులు పడే అవకాశం ఉంది.
డిసెంబర్‌లోగా కష్టమే..
విమానాశ్రయం కోసం భూములు కోల్పోతున్న గాడిపల్లి, గుంటూరుపల్లి, నక్కలపల్లి, మామునూరు రైతులతో ప్రభుత్వం చర్చలు జరపాలి. సాధ్యమైనంత తొందరగా భూములు ఏఏఐకి అప్పగిస్తే నిర్మాణ పనులు ప్రారంభమవుతాయి. మామునూరు ఎయిర్‌పోర్ట్ నిర్మాణ తొలి దశను డిసెంబర్‌లోగా పూర్తిచేసి దేశీయ విమానాల రాకపోకలను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నా.. మరింత ఆలస్యం అయ్యే అవకాశం లేకపోలేదు. భూసేకరణ పూర్తయితే 150 నుంచి 186 మంది ప్రయాణించేలా వీలున్న 37.6 మీటర్ల (123 ఫీట్ల) పొడవున్న ఏ–320, బీ–737 విమానాలు రాకపోకలు సాగించనున్నాయి. ఇప్పటికీ ఆ పాత ఎయిర్‌స్ట్రిప్‌కు చెందిన 696 ఎకరాల భూమి ఎయిర్ ఫోర్స్ అథారిటీ ఆధీనంలో ఉంది. ఈ రన్‌వే విస్తరణ కోసం అదనంగా అవసరమయ్యే 253 ఎకరాల భూమి సేకరిస్తున్న సంగతి తెలిసిందే.
మామునూరు విమానాశ్రయానికి
253 ఎకరాల గుర్తింపు
నోటిఫికేషన్ జారీ చేసేందుకు అధికారుల కసరత్తు
ఎకరానికి ప్రభుత్వం చెల్లించే
ధరపై నిర్వాసితుల దృష్టి
సర్వే పూర్తి.. ఇక భూసేకరణే