
ప్రతికూల వాతావరణంలోనూ పునరుద్ధరించాలి
హన్మకొండ: ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగితే త్వరితగతిన పునరుద్ధరించాలని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి సూచించారు. గురువారం హనుమకొండ నక్కలగుట్టలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో ఇన్‌చార్జ్ డైరెక్టర్లు, సీఈలు, సీజీఎంల సమీక్ష సమావేశం జరిగింది. ఈసమావేశంలో సీఎండీ వరుణ్‌రెడ్డి మాట్లాడుతూ రాబోయే మూడు రోజులు ఈదురుగాలులతో కూడిన వర్షాలుంటాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఎన్పీడీసీఎల్ పరిధిలోని 16 సర్కిళ్లలో అధికారులు, ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎక్కడైనా ట్రిప్పింగ్స్, బ్రేక్ డౌన్స్ సంభవిస్తే త్వరితగతిన పునరుద్ధరణ చర్యలు చేపట్టాలన్నారు. పోల్ నంబరింగ్, మ్యాపింగ్ పనులు పూర్తి చేయాలన్నారు. ఫీడ్ బ్యాక్ సెల్ పనితీరును అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో ఇన్‌చార్జ్ డైరెక్టర్లు బి.అశోక్ కుమార్, టి.సదర్‌లాల్, వి.తిరుపతిరెడ్డి, టి.మధుసూదన్, సీఈలు కె.తిరుమల్‌రావు, అశోక్, బీకం సింగ్, వెంకట రమణ, జీఎంలు అన్నపూర్ణ, నాగప్రసాద్, సురేందర్, శ్రీనివాస్, వేణు బాబు, కృష్ణమోహన్ పాల్గొన్నారు.
ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి