
సరస్వతీ పుష్కరాల్లో ‘జ్ఞానతీర్థం’ శోభ
కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో మే 15 నుంచి 26 వరకు సరస్వతీ పుష్కరాలు జరగనున్నాయి. ఇందులో జ్ఞానతీర్థం (ఆహ్వాన విగ్రహం) ఏర్పాటు చేయనున్నారు. పుష్కరాల అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.25 కోట్ల నిధులు మంజూరు చేసి విడుదల చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యార్ పలుమార్లు సమీక్షలు, క్షేత్రస్థాయి పర్యటనలతో పనులు ఊపందుకున్నాయి. రాష్ట్ర ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రత్యేక దృష్టి సారించడంతో పనుల్లో వేగం పెరిగింది. సరస్వతీ పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం రూ.20 లక్షలతో ‘జ్ఞాన తీర్థం’ ఎఫ్‌ఆర్పీ ఫైబర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. తాళపత్ర గ్రంథాలతో రెండు చేతుల్లో దీపం వెలిగి ప్రకాశించేలా ఫైబర్ విగ్రహం నిర్మాణం చేయనున్నారు. దీని నమూనా చిత్రాలను అర్కిటెక్టులు, ఇంజినీర్లు తయారు చేశారు. ఈ విగ్రహం ఉద్దేశం ఏంటంటే.. పూర్వం ఓ కాకి.. నదిలో స్నానం చేసి హంసలా మారి జ్ఞానం పొందింది. అలా ఇక్కడి నదిలో స్నానం చేసిన భక్తులు జ్ఞానాన్ని పొందుతారని సారంశంగా, భక్తులను ఆహ్వానించేలా ఉండేలా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయవర్గాలు తెలిపాయి. అదేవిధంగా జ్ఞానతీర్థం (వీఐపీ) ఘాట్ రెయిలింగ్‌కు కాకి, హంస, మకరం చిత్రాలను రాతిపై చెక్కి అమర్చనున్నారు.