
ఈదురు గాలులు.. పంటలు నేలపాలు
దుగ్గొండి: నర్సంపేట డివిజన్‌లో సోమవారం రాత్రి భారీగా వీచిన ఈదురుగాలులు బీభత్సాన్ని సృష్టించాయి. పలు గ్రామాల్లో పంటలు నేలవాలి, ఇళ్లు కూలిపోయాయి. చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దుగ్గొండి మండలం మందపల్లి, చాపలబండ, దుగ్గొండి, లక్ష్మీపురం గ్రామాల్లో అరటి తోటలు, అడవిరంగాపురం గ్రామంలో సింగతి సునీల్, రాజన్న, వెంకటాపురం గ్రామానికి చెందిన ఎరుకల యుగంధర్ బొప్పాయి తోటలు దెబ్బతిన్నాయి. శివాజీనగర్ గ్రామంలో బుస్సారి రామారావు మునగతోటలో చెట్లు విరిగి పోయాయి. లక్షల రూపాయలు పెట్టుబడి తీరా పంట చేతికొచ్చే సమయంలో ప్రకృతి విలయతాండవం చేసిందని రైతులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. వందల ఎకరాల్లో మొక్కజొన్న చేలు నేలవాలాయి. ప్రభుత్వం పరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు. అదేవిధంగా మంగళవారం రాత్రి కూడా ఈదురు గాలులు వీచాయి.
పంటలను పరిశీలించిన ఉద్యానశాఖ అధికారి
గ్రామాల్లో దెబ్బతిన్న అరటి, బొప్పాయి తోటలను డివిజన్ ఉద్యానశాఖ అధికారి జ్యోతి మంగళవారం పరిశీలించారు. పంటలు నష్టపోయిన రైతుల వివరాలు నమోదు చేసుకున్నారు.
రైతులకు లక్షల రూపాయల నష్టం
ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి