
ప్రకృతి వనాల్లో పచ్చదనం ఎక్కడ?
నర్సంపేట: మున్సిపాలిటీ ఖాళీ స్థలాల్లో ఏర్పాటు చేసిన పట్టణ ప్రకృతి వనాల నిర్వహణలో లోపాలు వెలుగు చూస్తున్నాయి. ఇందులో నాటిన మొక్కలు ఎండలకు ఎండిపోతున్నాయి. సిబ్బంది నీరు పట్టకపోవడంతో పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. నర్సంపేట మున్సిపాలిటీలో 24 వార్డులు ఉన్నాయి. ఇందులో 14 ఖాళీ స్థలాల్లో పట్టణ ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు. ఒక్కో వనానికి రూ.5 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు నిధులు వెచ్చించారు. ఎండలు క్రమంగా పెరిగిపోతున్నాయి. ప్రకృతి వనాల్లో వందలాది మొక్కలు నాటగా ప్రస్తుత ఎండలతో ఐదు శాతం కూడా కనిపించడం లేదు. ఏప్రిల్‌లోనే ఎండలు ఇలా ఉంటే మేలో ఎలా ఉంటాయోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ,
పర్యవేక్షణ విభాగం లేదు..
ప్రకృతి వనాల పర్యవేక్షణ కోసం రెండు సంవత్సరాల క్రితం బాధ్యతలు చేపట్టిన ఎన్విరాన్‌మెంట్ ఇంజనీర్ సంతోష్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లిపోయారు. నాటి నుంచి శానిటరీ ఇన్‌స్పెక్టర్ నాగరాజు అదనపు బాధ్యతలు తీసుకుని శానిటరీ సిబ్బందితో పనులు చేపడుతున్నా ఫలితం లేదు. వాస్తవానికి గ్రీన్ ఫండ్ కింద మున్సిపాలిటీ బడ్జెట్‌లో 10 శాతం నిధలు కేటాయిస్తున్నారు. నిధులు ఖర్చు అవుతున్నట్లు రికార్డుల్లో చూపుతున్నా ప్రకృతి వనాల్లో మొక్కలు మాత్రం కనుమరుగవుతున్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రకృతి వనాలను పట్టించుకోకపోవడంతో పట్టణ ప్రజలకు ఆహ్లాదం కరువైంది. ఇప్పటికై నా కలెక్టర్ స్పందించి నర్సంపేట మున్సిపాలిటీలోని ప్రకృతి వనాల అభివృద్ధి కోసం అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు.
నర్సంపేటలో ఎండిపోతున్న మొక్కలు.. నిర్వహణ అధ్వానం
పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు
ఈ ఫొటోలో కనిపిస్తున్నది నర్సంపేట పట్టణంలోని నెక్కొండ రోడ్డులో ఉన్న పట్టణ ప్రకృతి వనం. 2023 జూన్ 16న రూ.15 లక్షల పట్టణ ప్రగతి నిధులతో దీనిని ఏర్పాటు చేశారు. చుట్టూ ముళ్లకంచె, వాకింగ్ ట్రాక్, ఆహ్లాదకరమైన పూల మొక్కలు మొదట్లో ఉండేవి. ఇందులో ఏర్పాటు చేసిన బోరు నుంచి 10 నిమిషాలు కూడా నీళ్లు రాని పరిస్థితి. ట్రాక్టర్ ద్వారా మొక్కలకు నీటిని అందించాలనుకుంటే ఏర్పాటు చేసిన నేమ్ బోర్డు ఇరుకుగా ఉంది. ఈ సాకుతో నీరు పోయకపోవడం, పర్యవేక్షణ లేకపోవడంతో మొక్కలు ఎండిపోయి పట్టణ ప్రకృతి వనం కళావిహీంగా కనిపిస్తోంది.

ప్రకృతి వనాల్లో పచ్చదనం ఎక్కడ?