
రైతు పండించిన ప్రతీ గింజ కొంటాం..
పరకాల: రైతు సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను గిట్టుబాటు ధరతో ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, దళారులను ఆశ్రయించి మోసపోవద్దని అన్నారు. సోమవారం పరకాల మండలం నాగారం గ్రామంలో డీఆర్‌డీఏ, ఎస్‌ఈఆర్‌పీ పౌరసరఫరాల శాఖ, ప్రగతి గ్రామ సమైఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రంతోపాటు పరకాల వ్యవసాయ మార్కెట్ ఆవరణలో పీఎసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎంతో శ్రమించి ధాన్యం అమ్ముకోవడానికి వచ్చే రైతులకు కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన సౌకర్యాలు కల్పించాలన్నారు. ఎటువంటి కటింగ్ లేకుండా కొనుగోలు చేయాలని అధికారులకు ఆయన స్పష్టం చేశారు. సన్నరకం ధాన్యానికి రూ.500 బోసన్ అందిస్తుందని, ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం 17శాతం తేమశాతం ఉండేలా చూసుకోవాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో పరకాల వ్యవసాయ మార్కెట్ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి, ఏఓ శ్రీనివాస్, ఐకేపీ ఏపీఓ క్రాంతి, మాజీ ఎంపీపీ స్వర్ణలత, కాంగ్రెస్ పార్టీ పరకాల పట్టణ, మండల అధ్యక్షులు కొయ్యడ శ్రీనివాస్, కట్కూరి దేవేందర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి