
బంగారం షాపుల్లో విజిలెన్స్ తనిఖీలు
భీమవరం (ప్రకాశంచౌక్)/పాలకొల్లు (సెంట్రల్): ఏలూరు రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి వి.శ్రీరాంబాబు ఆదేశాల మేరకు భీమవరం, పాలకొల్లు పట్టణాల్లోని బంగారం షాపులపై విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. విజిలెన్స్, సేల్స్ టాక్స్ అండ్ లీగల్ మెట్రాలజీ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో భీమవరంలోని శ్రీ సునీత జ్యూయలర్స్, వీకే బులియన్ గోల్డ్ షాపుల నందు అన్ స్టాంప్డ్ ఎలక్ట్రానిక్ వేయింగ్ మెషిన్ ఉన్నట్లు గుర్తించారు. అదేవిధంగా సునీత జ్యూయలర్స్ షాప్ నందు రికార్డుల్లో ఉండాల్సిన దాని కంటే వెండి నిల్వలు 5 కేజీలు ఎక్కువగా ఉన్నట్లుగా గుర్తించారు. అలాగే పాలకొల్లులో జరిపిన తనిఖీల్లో పట్నాల బ్రదర్స్ జ్యూయలరీ షాప్ నందు బంగారపు నిల్వల్లో 253 గ్రాములు, వెండి నిల్వల్లో 1500 గ్రాములు తక్కువ ఉన్నట్లు గుర్తించారు. శ్రీనివాస జ్యూయలర్స్ షాప్‌లో బంగారం నిలువల్లో 92 గ్రాములు, వెండి నిల్వల్లో వెయ్యి గ్రాములు తక్కువ ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. ఆయా బంగారం షాపులపై అధికారులు కేసు నమోదు చేశారు. తనిఖీల్లో విజిలెన్స్ ఇన్‌స్పెక్టర్లు పి శివరామకృష్ణ, డి ప్రసాద్‌కుమార్, విజిలెన్స్ ఎస్సైలు సీహెచ్ రంజిత్‌కుమార్, కె.సీతారామ, సేల్స్ టాక్స్ అధికారులు పీవీ హేమమాలిని, ఎస్‌కే షబ్బీర్, లీగల్ మెట్రాలజీ అధికారి రాంబాబు, సిబ్బంది పాల్గొన్నారు.