
సాంకేతిక ఆధారిత పరిశ్రమలు స్థాపించాలి
భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలో సాంకేతిక ఆధారిత పరిశ్రమల స్థాపనపై ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు దృష్టి సారించాలని పశ్చిమగోదావరి జిల్లా అభివృద్ధి ప్రత్యేక అధికారి ఎ.సూర్యకుమారి తెలిపారు. జిల్లాకు ప్రత్యేక అధికారిగా నియమితులయ్యాక తొలిసారి జిల్లాకు వచ్చిన ఎ.సూర్యకుమారికి కలెక్టర్ చదలవాడ నాగరాణి, జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి స్వాగతం పలికారు. అనంతరం కలెక్టరేట్‌లో ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హాజరైన పారిశ్రామిక వేత్తల నుంచి పరిశ్రమల నిర్వహణలో ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో విషయాలపై సంబంధిత శాఖల అధికారులతో చర్చించి కార్యాచరణను రూపొందించి అమలు చేస్తానని హామీ ఇచ్చారు. ప్రతినెల జిల్లా కలెక్టర్‌తో కలిసి సమావేశం నిర్వహిస్తామన్నారు. కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ జిల్లా అభివృద్ధిలో పారిశ్రామిక అభివృద్ధి ఎంతో ముఖ్యమని, మంచి యూనిట్లు నెలకొల్పడానికి ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు జిల్లా యంత్రాంగం తరఫున పూర్తి సహాయ సహకారాలను అందిస్తామన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి మొగిలి వెంకటేశ్వర్లు, పరిశ్రమల సంస్థ జనరల్ మేనేజర్ యు.మంగపతి రావు, డీఆర్డిఏ పీడీ ఎం.ఎస్.ఎస్ వేణుగోపాల్, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ జడ్.వెంకటేశ్వరరావు, కార్మిక శాఖ అధికారి ఎ.లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
పింఛన్ల పంపిణీ
పింఛన్లను సద్వినియోగం చేసుకుని, ప్రభుత్వం కల్పిస్తున అవకాశాలతో మెరుగైన జీవనాన్ని కొనసాగించాలని మహిళా శిశు సంక్షేమం, దివ్యాంగుల శాఖల ప్రభుత్వ కార్యదర్శి, జిల్లా ప్రత్యేక అధికారి ఎ.సూర్య కుమారి అన్నారు. మంగళవారం భీమవరం పట్టణంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం పింఛన్లను పెద్ద మొత్తంలో పెంచి అండగా నిలిచిందన్నారు. అవసరమైన మేరకు వినియోగించుకొని కొంతైనా అవసరాల కోసం దాచుకోవాలని సూచించారు.