
21 నుంచి దివ్యాంగులకురాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు
తాడేపల్లిగూడెం (టీఓసీ): ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం తోటపల్లి గ్రామంలో దివ్యాంగులకు ఈనెల 21 నుంచి 23 వరకు రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు పశ్చిమ గోదావరి జిల్లా సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ పి.శ్యామ్ సుందర్ వెల్లడించారు. వివిధ రకాల వైకల్యం గల కలిగిన 12 నుంచి 21 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు కోసం ప్రత్యేక ఒలింపిక్ భారత్ (ఎస్‌ఓబీ) సహకారంతో క్రీడలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. విజేతలకు మెడల్స్, మెరిట్ సర్టిఫికెట్లు అందజేస్తామని తెలిపారు. క్రీడా స్ఫూర్తిని కలిగించి పోటీల్లో పాల్గొనే విధంగా దివ్యాంగుల్లో చైతన్యం కలిగించాలని భవిత సెంటర్ ప్రత్యేక ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. క్రీడా పోటీలు నడక, బ్యాడ్మింటన్, సైక్లింగ్, బాల్ త్రో తదితర పోటీలు ఉంటాయని వివరించారు.
కోకో రైతుల చలో గుంటూరు వాయిదా
ఏలూరు (టూటౌన్): కోకో రైతులకు న్యాయం చేస్తామని ఈనెల 12వ తేదీన ఆగిరిపల్లి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ఈనెల 15న (రేపటి) చేపట్టనున్న చలో గుంటూరు కార్యక్రమం వాయిదా వేసినట్లు ఆంధ్రప్రదేశ్ కోకో రైతు సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం ప్రకటించింది. సోమవారం ఏలూరు అన్నే భవనంలో ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొల్లు రామకృష్ణ్ణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో కోకో రైతుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఎస్.గోపాలకృష్ణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడారు. కోకో గింజలు కొనుగోలు, ధర సమస్యలను ఈనెల 7వ తేదీ లోపు పరిష్కారం చేస్తామని ఇటీవల రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఇచ్చిన హామీ అమలు కాలేదన్నారు. కోకో గింజల ధరల నిర్ణయ ప్రకటన చేయకపోవడంతో కంపెనీలు అతి తక్కువ ధర కొనుగోలు చేయడం వలన కోకో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో చలో గుంటూరు కార్యక్రమానికి పిలుపునిచ్చామని, అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి త్వరలో కోకో రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. దీంతో ఆందోళన కార్యక్రమం వాయిదా వేశామని, హామీ అమలు చేయకపోతే మరలా తమ పోరాటాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు. అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం కోకో గింజలకు ధర కల్పించాలని, పాత గింజలు వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కంపెనీల మోసాలు అరికట్టాలని కోరారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోళ్ల వెంకట సుబ్బారావు, పానుగంటి అచ్యుతరామయ్య, రాష్ట్ర సహాయ కార్యదర్శి గుదిబండి వీరారెడ్డి, ఉప్పల కాశీ నాయకులు పి.నరసింహారావు, వి.రాంబాబు, యలమాటి విశ్వేశ్వరరావు పాల్గొన్నారు.