
షోకాజ్ నోటీసుల ఉపసంహరణ
భీమవరం(ప్రకాశం చౌక్): పీ4 సర్వేకు సంబంధించి భీమవరంలో 26 మంది సచివాలయ ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు ఇవ్వడంపై ఇటీవల ‘సాక్షి’లో ప్రచురించిన కథనంపై అధికారులు స్పందించారు. విషయాన్ని ఉద్యోగుల సంఘ నాయకులు రాష్ట్రస్థాయి అధికారులు దృష్టికి తీసుకువెళ్లడంతో వారు స్పందించారు. 26 మంది సచివాలయ ఉద్యోగులకు ఇచ్చిన షోకాజ్ నోటీసులు విత్‌డ్రా చేసుకోవాలని ఆదేశించడంతో మున్సిపల్ కమిషనర్ ఈ దిశగా చర్యలు తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేశారు.
మందకొడి సర్వేతోనే..
పట్టణంలో పీ4 సర్వే మందకొడిగా జరగడంతో కొందరు సచివాలయ ఉద్యోగులకు నోటీసులు ఇచ్చామని మున్సిపల్ కమిషన్ కె.రామచంద్రారెడ్డి తెలిపారు. మున్సిపాలిటీలో కేవలం 12 శాతం మాత్రమే సర్వే జరిగిందని, 12 సచివాలయాల్లో సర్వే కనీసం మొదలు కాలేదన్నారు. ఈ క్రమంలోనే నోటీసులు ఇచ్చామని, ఉద్యోగులపై ఎలాంటి ఒత్తిడి లేదని పేర్కొన్నారు.
ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
భీమవరం: గురు పూజోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 5న ఉపాధ్యాయులకు అవార్డులు అందించనున్నామని, ఈనెల 8లోపు దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ ఈ.నారాయణ గురు వారం ఓ ప్రకటనలో తెలిపారు. కనీసం పదేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్నవారు అర్హులన్నారు. 16న తుది జాబితా రాష్ట్ర కార్యాలయానికి పంపిస్తామని, 21 నుంచి మూడు రోజులపాటు రాష్ట్రస్థాయిలో ఎంపికై న ఉపాధ్యాయులకు ఇంటర్వ్యూలు నిర్వహించి 25న ఎంపికై న వారి తుది జాబితాను విడుదల చేస్తారని డీఈఓ నారాయణ తెలిపారు.
చేనేత వస్త్రాలను ఆదరించాలి
భీమవరం(ప్రకాశం చౌక్): జిల్లాలో చేనేత వస్త్రాలకు విస్తృత ప్రచారం కల్పించి, మార్కెటింగ్‌ను పెంపొందించాలని ఇన్‌చార్జి కలెక్టర్ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి సూచించారు. గురు వారం జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా చేనేత, జౌళిశాఖ ఆధ్వర్యంలో ప్రకా శం చౌక్ నుంచి మున్సిపల్ కార్యాలయం వర కు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన చేనేత వస్త్ర ప్రదర్శన, అమ్మకం ప్రారంభం, నేత కార్మికులకు సత్కారం కార్యక్రమాల్లో ఇన్‌చార్జి కలెక్టర్, రాష్ట్ర మహిళా సహకార ఆర్థిక కార్పొరేషన్ చైర్మన్ పీతల సుజాత పాల్గొన్నారు. ఆర్డీఓ కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి, జిల్లా చేనేత, జౌళి శాఖ అధికారి కె.అప్పారావు, మున్సిపల్ కమిషనర్ కె.రామచంద్రారెడ్డి, నేత కార్మికులు పాల్గొన్నారు.
మార్గదర్శిగా నమోదు స్వచ్ఛందమే..
పీ4పై అవగాహన లేకుండా ప్రజలకు వక్రభాష్యం చెప్పే ప్రచారాన్ని ఉపేక్షించేది లేదని ఇన్‌చార్జి కలెక్టర్ ఓ ప్రకటనలో తెలిపారు. బంగారు కుటుంబాలను ఆదుకోవడంలో మార్గద ర్శుల ఎంపిక పూర్తిగా స్వచ్ఛందంగానే జరుగుతోందన్నారు. మార్గదర్శుల నమోదుకు ఒత్తిడి లేదన్నారు. బంగారు కుటుంబాలను మార్గదర్శులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి దత్తత తీసుకోవాలనేది ప్రభుత్వ ఉద్దేశమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ కలెక్టర్లకు స్పష్టం చేశారు. రాష్ట్ర సచివాలయం నుంచి ఆయన కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భీమవరం కలెక్టరేట్ నుంచి ఇన్‌చార్జి కలెక్టర్, అధికారులు హాజరయ్యారు.
బ్యాంకు ఏజెంట్ల పేరుతో మోసం
భీమవరం: బ్యాంకు రికవరీ ఏజెంట్లుమంటూ ఇద్దరు వ్యక్తులు భీమవరం ఏడో వార్డుకు చెందిన కె.రామలక్ష్మి నుంచి రూ.2 లక్షలు తీసు కుని మోసగించినట్టు పోలీసులు తెలిపారు. పట్టణంలోని మారుతీనగర్‌లో భవనానికి మార్టిగేజ్ రుణం తీసుకున్నారు. వాయిదా చెల్లించాల్సి ఉండగా హైకోర్టులో స్టే వేద్దామని చెప్పి నగదు తీసుకుని ఇప్పటివరకు సమాధానం చెప్పడం లేదని రామలక్ష్మి ఫిర్యాదులో పేర్కొనగా ఎస్సై బీవై కిరణ్‌కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
హుండీ ఆదాయం లెక్కింపు
భీమవరం(ప్రకాశం చౌక్): పంచారామ క్షేత్రం గునుపూడి ఉమాసోమేశ్వర జనార్దన స్వామి దేవస్థానంలో హుండీల ఆదాయాన్ని గురువారం లెక్కించారు. రూ.10,50,655 లభించిన్నట్లు ఈఓ డి.రామకృష్ణంరాజు తెలిపారు.. స్వామి వారి నిత్యాన్నదానానికి రూ.18,886 లభించిందన్నారు. కార్యనిర్వహణాధికారి కర్రి శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు.