
బెనిఫిట్స్ లేవు.. పెన్షన్ లేదు
● రిటైర్డ్ అయిన అంగన్‌వాడీ
సిబ్బందికి అందని బెనిఫిట్స్
● ఆవేదన వ్యక్తం చేస్తున్న 20మంది టీచర్లు, 108 మంది హెల్పర్లు
భువనగిరిటౌన్: రిటైర్డ్ అయిన అంగన్‌వాడీలపై ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపుతోంది. ఉద్యోగ విరమణ పొంది తొమ్మిది నెలలు అవుతున్నా.. రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ రాకపోవడంతో 20మంది అంగన్‌వాడీ టీచర్లు, 108 మంది హెల్పర్లు కుటుంబాన్ని నెట్టుకొచ్చేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రిటైర్డ్ బెనిఫిట్స్ కోసం పలుమార్లు విన్నవించినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అమలు కాని ఎన్నికల హామీ
అంగన్‌వాడీ టీచర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు రూ.18వేల వేతనం ఇస్తామని ప్రకటించింది. టీచర్లకు రూ.2లక్షలు, ఆయాలకు రూ.లక్ష చొప్పున రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ ఇస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది. కానీ ఇప్పుడు అమలు చేయడం లేదు. 2024 జూలై 1నుంచి ఆలేరు, రామన్నపేట, భువనగిరి, మోత్కూర్ పరిధిలో 20 మంది అంగన్‌వాడీ టీచర్లు, 108 మంది హెల్పర్లు పదవీ విరమణ పొందారు.
ప్రభుత్వ నిర్ణయంతో..
అంగన్‌వాడీ టీచర్లకు తప్పనిసరి రిటైర్‌మెంట్ అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద టీచర్లకు రూ.లక్ష, ఆయాలకు రూ. 50వేలు ఇస్తామని మొదట్లో ప్రకటించింది. దీనిపై అంగన్‌వాడీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. అరకొర వేతనాలతో ఇంతకాలం పనిచేశామని, ఇప్పుడు ఈ కొద్దిపాటి డబ్బులతో ఎలా బతకాలని ప్రశ్నించారు. దీంతో ప్రభుత్వం సమీక్షించి టీచర్లకు రూ.2 లక్షలు, ఆయాలకు రూ.లక్ష చొప్పున ఇస్తామని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రకటించారు. అంతేకాకుండా ఆసరా పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ పదవీ విరమణ పొంది నెలలు గడుస్తున్నా మంత్రి హామీ ఆచరణకు నోచుకోవడంలేదని అంగన్‌వాడీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న టీచర్‌కు వేతనం రూ.13,650కు, ఆయాలకు రూ.7,500కు అందజేస్తున్నారు.