
తల్లిదండ్రులను చూసుకునే బాధ్యత పిల్లలదే
బీబీనగర్: తల్లిదండ్రుల సంరక్షణను విస్మరించకుండా వారిని చూసుకునే బాధ్యత పిల్లలదేనని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. బీబీనగర్ మండల కేంద్రంలో దాతల సహకారంతో నిర్మించిన వయో వృద్ధుల ఆశ్రయ భవనాన్ని బుధవారం భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా గుత్తా మాట్లాడుతూ.. వృద్ధుల కోసం ఉన్నటువంటి చట్టాలపై అవగాహన పెంచుకొని వాటిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వృద్ధుల సంక్షేమం కోసం ఆరోగ్యశ్రీని రూ.10లక్షలకు పెంచిందని, అలాగే ప్రతిఒక్కరికి సీఎం రీలీఫ్ ఫండ్‌కు బదులుగా ఆరోగ్య బీమాను కల్పించేలా ఆలోచిస్తుందని అన్నారు. దీంతో తల్లిదండ్రులు భారం అనుకునే వారికి భయం ఉండదని అన్నారు. కష్టాల్లో ఉన్న కుటుంబ సభ్యులను ఎలా ఆదుకుకోవాలో అన్న అంశంపై శాసనసభ, శాసనమండలిలో చాలా సీరియస్‌గా చర్చ జరిగిందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 40లక్షల మంది వయో వృద్ధులకు ప్రభుత్వం పెన్షన్లు ఇస్తుందని, అన్నివర్గాల వారికి మేలు జరిగే విధంగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. వయో వృద్ధులు మానసికంగా బలంగా ఉండాలని అన్నారు. వృద్ధుల కోసం పార్క్ ఏర్పాటుకు కృషిచేస్తానని అన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ కృష్ణారెడ్డి, మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు గోలి ప్రణీతాపింగళ్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, వయో వృద్ధుల భవన నిర్మాణ కమిటీ అధ్యక్షుడు కాసుల సత్యనారాయణగౌడ్, ప్రధాన కార్యదర్శి లింగారెడ్డి, కోశాధికారి సోమయ్య, ఉపాధ్యక్షులు ఆగమయ్యగౌడ్, ఎర్ర మనోహర్ తదితరులు పాల్గొన్నారు,
ఫ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి