
రేషన్ బియ్యం పట్టివేత
గట్టుప్పల్: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని గురువారం పోలీసులు పట్టుకున్నారు. ఎస్‌ఐ గుత్తా వెంకట్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సంస్థాన్ నారాయణపురం మండలంం డాకు తండాకు చెందిన దశరథ గట్టుప్పల్ మండలంలో రేషన్ లబ్ధిదారుల నుంచి రేషన్ బియ్యం కొనుగోలు చేసి అంతంపేటలోని ఓ ఇంట్లో భద్రపరిచాడు. ఈ బియ్యాన్ని గురువారం బొలేరో వాహనంలో గట్టుప్పల్ మీదుగా సంస్థాన్ నారాయణపురంలోని కోళ్లఫాంకు తరలిస్తుండగా.. విజిలెన్స్ అధికారుల సమాచారం మేరకు గట్టుప్పల్ పోలీసులు పట్టుకున్నారు. సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ సైదులు 20 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని ఎంఎల్‌ఎస్ పాయింట్‌లో భద్రపరిచారు. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
చిట్యాల: చిట్యాల పట్టణంలోని గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందాడు. నార్కట్‌పల్లికి చెందిన బాశెట్టి శ్రీనివాస్ అలియాస్ వెంకన్న(58) చిట్యాల పట్టణంలోని భువనగిరి రోడ్డులో గల రైస్ మిల్లులో గుమాస్తాగా పనిచేస్తున్నాడు. గురువారం నార్కట్‌పల్లి నుంచి బైక్‌పై వెళ్తుండగా.. చిట్యాల పట్టణ సమీపంలోని బాలనర్సింహస్వామి ఆలయం వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీనివాస్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు.
బీబీనగర్‌లో రాకెట్
సామగ్రి తయారీ
బీబీనగర్: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) త్వరలో ప్రయోగించనున్న జీఎస్‌ఎల్వీ రాకెట్‌లో వినియోగించే ఎకోథెర్మ్ ఫినోలిక్ ఫోం ప్యాడ్‌ల తయారీ బీబీనగర్ మండలంలో జరిగింది. మండల పరిధిలోని జమీలాపేట గ్రామ శివారులో గల వీఎన్‌డీ సెల్ ప్లాస్ట్ పరిశ్రమలో 365 ఎకోథెర్మ్ ఫినోలిక్ ఫోం ప్యాడ్‌లను తయారు చేశారు. రాకెట్‌లో వినియోగించనున్న వీటిని పరిశ్రమ యాజమాన్యం ఇస్రో సంస్థతో ఒప్పందం చేసుకొని తయారు చేసినట్లు సమాచారం. ప్యాడ్‌ల తయారీ పూర్తికావడంతో వాటిని పరిశ్రమ నుంచి తిరువనంతపురంలోని విక్రమ్ సారాబాయ్ స్పేస్ సెంటర్‌కు కంటైనర్ల ద్వారా తరలించారు.