
ఇచ్చేదే కొంత.. దానికీ చింతే!
ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం
ఇచ్చే కొద్దిపాటి జీతం కూడా క్రమం తప్పకుండా చెల్లించకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం. కుటుంబపోషణ భారంగా మారుతోంది. అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సర్పంచ్‌లు ఉన్నప్పుడు క్రమం తప్పకుండా జీతాలు ఇచ్చేవారు. ఇప్పుడు నెలల తరబడి ఎదురుచూడాల్సి వస్తుంది.
– నర్సింహ, పారిశుద్ధ్య కార్మికుడు, మహబూబ్‌పేట
ప్రతినెలా తిప్పలే..
రెండు నెలలుగా జీతాలు పెండింగ్‌లో ఉన్నాయి. నాలుగు నెలల వేతనం బకాయి ఉండగా రెండు నెలల జీతం ఇచ్చారు. మరో రెండు నెలలు ఆపారు. ప్రతి నెలా ఇదే పరిస్ధితి కొనసాగుతుంది. వేతనాల అందక ఆర్థికంగా అవస్థలు పడుతున్నాం. ఇంటి అవసరాలకు బాకీలు చేయాల్సి వస్తుంది.
– బర్ల ఇస్తారి, పారిశుద్ధ్య కార్మికుడు, మాసాయిపేట
వేతనం కోసం పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల నిరీక్షణ
యాదగిరిగుట్టరూరల్ : గ్రామ పంచాయతీల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు ప్రతి నెలా 5వ తేదీ లోపే వేతనాలు చెల్లించాల్సి ఉండగా ఆలస్యమవుతోంది. 14 నెలలుగా ఏ సమయంలో వస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. జిల్లాలోని 428 గ్రామ పంచాయతీల్లో 1,860 మంది పారిశుద్ధ్య కార్మికులు ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్నారు. వీరికి నెలకు రూ.9,500 చొప్పున గ్రామ పంచాయతీలు వేతనం చెల్లిస్తున్నాయి. పంచాయతీల్లో పాలకవర్గాల పదవీకాలం ముగిసిన తరువాత వీరికి వేతన కష్టాలు మొదలయ్యాయి. ఎన్నికలు నిర్వహించకపోవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన స్పెషల్ గ్రాంట్స్, ఆర్థిక సంఘం నిధులు నిలిచిపోయాయి. దీంతో నిధుల కొరత ఏర్పడి ప్రత్యేక అధికారులు కూడా చేతులెత్తేస్తున్నారు. ఎంతోకొంత ఆస్తిపన్ను వసూలైనప్పటికీ పంచాయతీల నిర్వహణ ఖర్చులకే సరిపోతున్నాయి.
నెలనెలా ఎదురుచూపులే..
వీధులను శుభ్రం చేయడం, తాగునీటి సరఫరా, విద్యుత్ దీపాల నిర్వహణ తదితర సేవల్లో రోజూ పారిశుద్ధ్య కార్మికులు నిమగ్నమవుతుంటారు. వీరికి ప్రతినెలా వేతన వెతలు తప్పడం లేదు. ప్రస్తుతం రెండు నెలలకు (ఫిబ్రవరి, మార్చి) సంబంధించిన వేతనాలు రావాల్సి ఉంది.అధికారులు చొరవ చూపి క్రమం తప్పకుండా వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలని కార్మికులు కోరుతున్నారు.
నెలవారీ అవసరాలకు అవస్థలు
పాలకవర్గాల పదవీకాలం ముగియడానికి ముందు నెల కాగానే ఠంచన్‌గా వచ్చిన వేతనాలు ఆ తరువాత జాప్యం జరుగుతుండడంతో పారిశుద్ధ్య కార్మికులు అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా అద్దె ఇళ్లలో ఉన్న వారికి అద్దె చెల్లింపు, కిరాణ షాపుల్లో బకాయిలు, రుణాలు, చిట్టీలు ఉన్న వారికి కిస్తులు చెల్లించడం కష్టతరంగా మారింది.
ఫ రెండు నెలలుగా పెండింగ్
ఫ పంచాయతీల్లో నిధుల లేమి
ఫ చేతులెత్తేస్తున్న ప్రత్యేక అధికారులు

ఇచ్చేదే కొంత.. దానికీ చింతే!

ఇచ్చేదే కొంత.. దానికీ చింతే!