
28 నుంచి పాలిసెట్ ఉచిత శిక్షణ
యాదగిరిగుట్ట: టీజీ పాలిసెట్–2025 ప్రవేశ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ఈ నెల 28 నుంచి మే 8వ వరకు యాదగిరిగుట్ట ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 19వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ అని, మే 13వ తేదీన పాలిసెట్ ప్రవేశ పరీక్షలు జరగనున్నట్లు పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు సెల్ నంబర్ 80998 99793, 90106 29270ను సంప్రదించాలని కోరారు.
75శాతం సబ్సిడీపై
పశుగ్రాసం విత్తనాల సరఫరా
భువనగిరిటౌన్ : నేషనల్ లైవ్ స్టాక్ మిషన్, మినీ కిట్ పథకం కింద 75 శాతం సబ్సిడీపై పశుగ్రాసం విత్తనాలు సరఫరా చేయనున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 5 కేజీల కిట్ ధర రూ.492.50 ఉంటుందని పేర్కొన్నారు. 25శాతం రైతు వాటా కింద రూ.123.50 చెల్లించాలని తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని, ఆసక్తి గల వారు ఏఈఓలను సంప్రదించాలని కోరారు.
యాదగిరి క్షేత్రంలో
విశేష పూజలు
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో బుధవారం నిత్య పూజలు విశేషంగా కొనసాగాయి. వేకువజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వయంభూ, ప్రతిష్ఠా అలంకార మూర్తులకు సుప్రభాతం, అర్చన, అభిషేకం వంటి సంప్రదాయ పూజలు నిర్వహించారు. ఆలయంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి పూజలు విశేషంగా జరిపించారు. అనంతరం ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టోత్తర పూజలు చేపట్టారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి శ్రీస్వామి వారికి శయనోత్సవం నిర్వహించి ఆలయ ద్వార బంధనం చేశారు.
ఎంజీయూ
డిగ్రీ పరీక్షలు వాయిదా
నల్లగొండ టూటౌన్: మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో ఈనెల 17 నుంచి మే 15 వరకు జరగాల్సిన డిగ్రీ పరీక్షలను అనివార్య కారణాల వల్ల వాయిదా వేసినట్లు యూనివర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ (సీఓఈ) డాక్టర్ ఉపేందర్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని విద్యార్థులు గమనించాలని, తదుపరి పరీక్షలు ఎప్పుడు నిర్వహించేది త్వరలోనే ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు.
అసమానతల నిర్మూలనలో అంబేడ్కర్ కృషి మరువలేం
రామగిరి(నల్లగొండ): దేశంలో సామాజిక అసమానతల నిర్మూలనతోపాటు రాజ్యాంగ నిర్మాణంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ చేసిన కృషి మరువలేమని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ ఇ.వెంకటేసు అన్నారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా ప్రపంచీకరణ తర్వాత ప్రపంచంలో సామాజిక న్యాయం ఔచిత్యం అనే అంశంపై బుధవారం నల్లగొండలోని ఎన్జీ కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రాజ్యాంగంలో పొందుపరిచిన అనేక కీలక అంశాల్లో అంబేడ్కర్ పాత్ర ఉందన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్ మాట్లాడుతూ అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా యువత సమాజ ఉన్నతికి కారకులు కావాలని కోరారు. ముందుగా అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో అకడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ రవికుమార్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ అంతటి శ్రీనివాస్, ఐక్యూసి కోఆర్డినేటర్ వైవీఆర్.ప్రసన్నకుమార్, పరీక్ష నియంత్రణ అధికారి బి.నాగరాజు, డాక్టర్ మునిస్వామి తదితరులు పాల్గొన్నారు.