
రోడ్డుప్రమాదంలో మహిళ మృతి
కేతేపల్లి: కేతేపల్లిలో గురువారం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతిచెందింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి జిల్లా మోటకొండూరు గ్రామానికి చెందిన బందనాదం అరుణ(33)ఇటీవల తన తల్లిగారి ఊరైన కేతేపల్లి మండలంలోని రాయపురం గ్రామానికి వచ్చింది. ఈక్రమంలో తన ఇద్దరు పిల్లల జనన ధ్రువీకరణ పత్రాలు తీసుకునేందుకు గురువారం కేతేపల్లికి వచ్చిన అరుణ స్థానిక ఎస్సీ కాలనీ సమీపంలో కాలి నడకన రోడ్డును దాటుతుండగా హైదరాబాద్ వైపు నుంచి విజయవాడ వైపు వెళ్తున్న గుర్తు తెలియని లారీ ఢీ కొట్టింది. ఈప్రమాదంలో అరుణ తలకు తీవ్రంగా గాయమైంది. సమాచారం అందుకున్న కేతేపల్లి 108 అంబులెన్స్ సిబ్బంది సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న అరుణ ఆరోగ్యం విషమించి గురువారం సాయంత్రం మృతి చెందింది. కాగా.. మృతురాలి భర్త ప్రసాద్ ఏడేళ్ల క్రితమే అనారోగ్యంతో మృతి చెందాడు. వారికి పదేళ్ల లోపు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తల్లిదండ్రులు ఇద్దరూ మృతిచెందడంతో చిన్నారులు అనాథలుగా మారారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు కేతేపల్లి ఎస్‌ఐ శివతేజ తెలిపారు.
పెట్రోల్ పోసుకొని బాలిక ఆత్మహత్య
బీబీనగర్: మానసిక స్థితి సరిగా లేక మనోవేదనకు గురవుతున్న బాలిక ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన బీబీనగర్ మండలంలోని రుద్రవెళ్లి గ్రామంలో గురువారం చోటు చేసుకుంది, స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రుద్రవెళ్లి గ్రామానికి చెందిన గుండు దీపిక(17) మానసిక స్థితి బాగోలేక గత కొంత కాలంగా ఇంట్లోనే ఉంటుంది. ఇటీవల పలుమార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. మనోవేదనకు గురై గురువారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుంది. అరుపులు బయటకు వినిపించడంతో స్థానికులు దీపికను 108లో భువనగిరి ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచనల మేరకు గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి తండ్రి నర్సింహ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు.
ఉరేసుకుని యువకుడి బలవన్మరణం
తిరుమలగిరి(నాగార్జునసాగర్): కొన్ని నెలల క్రితం తల్లి మృతి చెందడంతో తీవ్ర మనస్తాపానికి గురైన యువకుడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన తిరుమలగిరి మండలంలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొంపెల్లి గ్రామానికి చెందిన చిత్రం కొండల్(35) భువనగిరి కలెక్టరేట్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. కొన్ని నెలల క్రితం తన తల్లి మృతి చెందటంతో అవివాహితుడైన కొండల్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. బుధవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నాగార్జునసాగర్ కమలానెహ్రూ ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి మల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వీరశేఖర్ తెలిపారు.