ప్రొద్దుటూరు: మండలంలోని గోపవరం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశారు. గురువారం పోలీసు బందోబస్తు ఏర్పాటులో విమర్శలు వెల్లువెత్తడంతో రెండో రోజు పటిష్టంగా నిర్వహించేలా చేశారు. ఉదయం 9 గంటల నుంచే డీఎస్పీ భావన ఆధ్వర్యంలో 144 సెక్షన్, పోలీసు 30 యాక్టు అమలు చేశారు. పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించి కొర్రపాడు రోడ్డులో ట్రాఫిక్‌ను మళ్లించారు. గ్రామ పంచాయతీ కార్యాలయం చుట్టూ అల్లరిమూకలు లేకుండా తరిమేశారు. ముందుగా టీడీపీ వార్డు సభ్యులు ఏడుగురు ఎన్నికలు నిర్వహించే గోపవరం గ్రామ పంచాయతీ కార్యాలయానికి వెళ్లారు. మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి కోరిక మేరకు.. రెండు వాహనాల్లో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి దొరసానిపల్లె నుంచి సర్పంచ్ గద్దా మోషాతోపాటు 13 మంది వైఎస్సార్‌సీపీ వార్డు సభ్యులను గ్రామ పంచాయతీ కార్యాలయానికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా పోలీసు బందోబస్తు ఉన్నా.. టీడీపీ నాయకులు బచ్చల వీరప్రతాప్, ఈవీ సుధాకర్‌రెడ్డి తదితరులు గ్రామ పంచాయతీ కార్యాలయంలోనికి వెళతామని దగ్గరికి వచ్చారు. లోపలికి వెళ్లేందుకు కుదరదని డీఎస్పీ వెనక్కి పంపారు.
మీడియాను అనుమతించకుండా..
ఇంతలోనే ఎన్నికల అధికారి రామాంజనేయరెడ్డి తనకు గుండెపోటు వచ్చిందని గుండె పట్టుకున్నారు. గోపవరం గ్రామ పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ ఆయనను తీసుకొచ్చి తన చాంబర్‌లో కూర్చోబెట్టారు. ఆ సమయంలో ఎన్నికల అధికారి ప్రశాంతంగా కూర్చున్నట్లు లోపల ఉన్న అధికారులే చెబుతున్నారు. అంతలోనే అంబులెన్స్‌ను పిలిపించడం.. ఎన్నికల అధికారి రామాంజనేయరెడ్డిని లోపలి నుంచి నడిపించుకుంటూ బయటికి తెచ్చి అంబులెన్స్ ఎక్కించారు. స్థానికంగా అయితే ఎక్కడ అసలు విషయం బటయపడుతుందని భావించి.. ఎన్నికల అధికారిని కడపలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించినట్లు చెబుతున్నారు. కొంత సేపటి తర్వాత పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ.. ఎన్నికల అధికారికి గుండెపోటు రావడంతో ఎన్నిక వాయిదా పడిందని, కలెక్టర్ ఆదేశాల తర్వాత మళ్లీ ఎన్నిక ఉంటుందని మీడియాకు తెలిపారు. కార్యాలయంలోనికి మాత్రం మీడియాను అనుమతించలేదు. కార్యాలయ ప్రాంగణంలో డీఎస్పీ భావన, ఆర్డీఓ సాయిశ్రీ, తహసీల్దార్ గంగయ్య మాట్లాడుకుంటూ ఉండగానే ఈ వ్యవహారమంతా జరిగింది. తర్వాత పోలీసు బందోబస్తుతో టీడీపీ వార్డు సభ్యులు, అనంతరం వైఎస్సార్‌సీపీ వార్డు సభ్యులను తమ ప్రాంతాలకు పంపించారు.
గుండెపోటు రాజకీయం
ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి ఆదేశాల మేరకు గుండెపోటు రాజకీయం జరిగిందని స్థానిక ప్రజలు చెప్పుకొంటున్నారు. గతంలో మున్సిపల్ మాజీ ఇన్‌చార్జి చైర్మన్ వీఎస్ ముక్తియార్ వైఎస్సార్‌సీపీలో ఉండగా.. ఆయనను మున్సిపల్ చైర్‌పర్సన్‌గా చేసేందుకు అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్న రాచమల్లు శివప్రసాదరెడ్డి మద్దతు ఇచ్చారు. ఆ సమయంలో కూడా వరదరాజులరెడ్డి వ్యూహం ప్రకారం.. ఇలాగే వ్యవహరించి ఎన్నికను వాయిదా వేయించారు. ప్రస్తుతం అదే తరహాలో ఉప సర్పంచ్ ఎన్నికను వాయిదా వేయించారని ప్రజలు చర్చించుకుంటున్నారు.
వ్యూహం ప్రకారం గొడవ
ఉదయం 11 గంటల ప్రాంతంలో ఎన్నిక జరగాల్సి ఉండగా ఒక వ్యూహం ప్రకారం ఎన్నికల కార్యాలయంలో టీడీపీకి చెందిన 7వ వార్డు సభ్యురాలు కాచన రామలక్షుమ్మ, ఉపసర్పంచ్ అభ్యర్థి మండ్ల రమాదేవి వాగ్వాదానికి దిగారు. ఒకరినొకరు దూషించుకున్నారు. వీరు గొడవ పడుతుండగానే 8వ వార్డు సభ్యురాలు గాయత్రి ఎన్నికల అధికారి వద్ద ఉన్న మినిట్స్ బుక్‌ను చేతిలోకి తీసుకుని చించి వేశారు. ఈ సందర్భంగానే 5వ వార్డు సభ్యుడు ఆదినారాయణరెడ్డి కుర్చీలు విసిరేశాడు. టీడీపీ సభ్యులైన వీరంతా పరిస్థితి ఉద్రిక్తతంగా ఉందనుకునేలా నటించారు.
మాజీ ఎమ్మెల్యే రాచమల్లు హౌస్ అరెస్టు
గోపవరం గ్రామ పంచాయతీ ఉపసర్పంచ్ ఎన్నిక సందర్భంగా పోలీసులు వైఎస్సార్‌సీపీ నేతలను హౌస్ అరెస్టు చేశారు. మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్లు పాతకోట బంగారు మునిరెడ్డి, ఆయిల్ మిల్ ఖాజా తదితరులకు పోలీసులు ముందస్తు నోటీసులను ఇచ్చి.. ఇంటి నుంచి బయటికి రాకుండా కాపలా ఉంచారు. గురువారం ఎన్నికల కార్యాలయంలోకి దౌర్జన్యంగా వెళ్లిన టీడీపీ నాయకులు బచ్చల వీరప్రతాప్, ఈవీ సుధాకర్‌రెడ్డి తదితరులు శుక్రవారం కూడా యథావిధిగా అక్కడికి రావడం గమనార్హం.
గోపవరం ఉప సర్పంచ్ ఎన్నిక మళ్లీ వాయిదా
వారిలో వారే గొడవకు దిగిన టీడీపీ వార్డు సభ్యులు
మినిట్స్ బుక్ చించివేత
వంత పాడిన అధికారులు
నటించి.. వాయిదా వేయించి..