బద్వేలు అర్బన్ : అప్పులబాధ తాళలేక యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం బద్వేలులో వెలుగు చూసింది. ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని పెద్ద అగ్రహారం గ్రామానికి చెందిన పగడాల చంద్రకుమార్ (36) బద్వేలులో టీ దుకాణం నిర్వహిస్తుండేవాడు. ఇతనికి భార్య సుమతితో పాటు కుమారుడు, కుమార్తె ఉన్నారు. టీ దుకాణం ఏర్పాటు చేసుకునే సమయంలో చేసిన అప్పులతో పాటు దుకాణం సక్రమంగా జరగకపోవడంతో చేసిన అప్పులు తడిసి మోపెడయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 26న ఓ పని నిమిత్తం కడపకు వెళుతున్నానని భార్యకు చెప్పి ఇంటి నుండి వచ్చేశాడు. అదే రోజు నెల్లూరు రోడ్డులోని బైపాస్ రోడ్డు సమీపంలో గల ఓ లాడ్జిలో గది అద్దెకు తీసుకుని ఉన్నాడు. అయితే రెండు రోజులుగా లాడ్జిలోని గది తలుపు తీయకపోవడం, గదిలో నుండి దుర్వాసన వస్తుండటంతో లాడ్జి యజమాని పోలీసులకు సమాచారమిచ్చాడు. వారు వెళ్ళి తలుపులు తెరిచి చూడగా మృతిచెంది ఉన్నాడు. మృతదేహం పక్కన పురుగుల మందు డబ్బా కనిపించడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. మృతుని భార్య సుమతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అర్బన్ ఎస్‌ఐ ఎం.సత్యనారాయణ కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
వ్యసనాలకు బానిసై..
ప్రొద్దుటూరు క్రైం : చెడు వ్యసనాలకు లోనైన ప్రేమ్‌సాయిరెడ్డి (23) అనే యువకుడు తెలిసిన వారి దగ్గర సుమారు రూ. 8 లక్షల వరకు అప్పులు చేశాడు. బాకీ ఎలా తీర్చాలో అర్థం కాక తీవ్ర మనస్థాపం చెందిన ఆ యువకుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వన్‌టౌన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రామేశ్వరంలోని కాకనూరు నాగేశ్వరరెడ్డి కిరాణాషాపు పెట్టుకొని జీవనం సాగించేవాడు. ఆయనకు కుమారుడు ప్రేమ్‌సాయిరెడ్డితో పాటు కుమార్తె ఉన్నారు. కుమారుడు బిటెక్ చదువుతూ మధ్యలో మానేసి హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. ఇటీవలే హైదరాబాద్‌లో ఉద్యోగం మానేసి కడపలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో ప్రైవేట్‌గా పని చేసేవాడు. అతను చెడు వ్యసనాలకు లోనై తల్లిదండ్రులకు డబ్బులు పంపమని అడిగేవాడు. అంతేగాక తెలిసిన వారి వద్ద కూడా సుమారు రూ. 8 లక్షల వరకు అప్పు చేశాడు. అప్పు ఎలా తీర్చాలా తరచూ ఆలోచిస్తూ బాధపడుతూ ఉండేవాడు. రెండు రోజుల క్రితం ప్రేమ్‌సాయిరెడ్డి ప్రొద్దుటూరుకు వచ్చాడు. ఇంటికి వచ్చినప్పటి నుంచి ఏదో ఆలోచిస్తూ దిగులుగా ఉండేవాడు. శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో రేకుల కప్పునకు ఉన్న ఇనుప పైపులకు చీరను కట్టుకొని ఉరేసుకున్నాడు. తర్వాత గుర్తించిన కుటుంబ సభ్యులు ప్రేమ్‌సాయిరెడ్డిని వెంటనే ప్రైవేట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యుడు తెలిపాడు. తండ్రి నాగేశ్వరరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వన్‌టౌన్ పోలీసులు తెలిపారు.
కడుపునొప్పి తాళలేక డిగ్రీ విద్యార్థి..
కడప అర్బన్ : కడప నగరం రామరాజు పల్లెలోని ఎస్సీ కాలనీకి చెందిన డిగ్రీ బీకాం ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడినట్లు తాలూకా సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. సీఐ వివరాల మేరకు రామరాజు పల్లెకు చెందిన రాజశేఖర్ (24) గత ఏడాది నుండి కడుపునొప్పితో బాధపడుతుండేవాడని తెలిపారు. కడుపు నొప్పి తగ్గకపోవడంతో తీవ్ర మనస్థాపానికి చెంది శుక్రవారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృత దేహాన్ని రిమ్స్‌కు తరలించారు. మృతుడి బంధువులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు తెలిపారు.
అప్పులబాధ తాళలేక యువకుడు ఆత్మహత్య
అప్పులబాధ తాళలేక యువకుడు ఆత్మహత్య