
మత సామరస్యానికి ప్రతీక కడప జిల్లా
కడప అర్బన్ : వైఎస్‌ఆర్ కడప జిల్లాలోని హిందూ, ముస్లిం సోదరులు కలిసిమెలిసి జీవిస్తూ మత సామరస్యానికి ప్రతీకగా జిల్లాను నిలిపారని జిల్లా ఎస్పీ ఈ.జీ అశోక్ కుమార్ పేర్కొన్నారు. స్థానిక ఉమేష్ చంద్ర స్మారక కల్యాణ మండపంలో ముస్లింలకు, పోలీస్ శాఖలోని ముస్లిం పోలీస్ అధికారులు, సిబ్బందికి రంజాన్ మాసం పురస్కరించుకుని ఆదివారం సాయంత్రం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అమీన్ పీర్ దర్గా ఇమామ్ ఇనాయతుల్లా ప్రత్యేక ప్రార్థన చేశారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఇఫ్తార్ విందు మత సామరస్యాన్ని చాటిందన్నారు. గతంలో కడప డీఎస్పీగా విధి నిర్వహణలో ఉన్నప్పుడు వినాయక చవితి, బక్రీద్, ఉగాది, రంజాన్ పండుగల సమయంలో హిందూ, ముస్లిం సోదరులు అందించిన సహకారం మరువలేనిదన్నారు. ఉగాది సందర్భంగా తాను దేవుని కడప ఆలయానికి వెళ్లినప్పుడు ముస్లింలు పూజలు నిర్వహించడం, అమీన్ పీర్ దర్గాను హిందువులు దర్శించుకోవడం కడప జిల్లా మత సామరస్య ఘనతకు నిదర్శనమన్నారు. అనంతపురం జిల్లాలోని గూగూడు కుళ్లాయి స్వామిని దర్శించుకున్నప్పుడు అక్కడ ముస్లిం సోదరులతో పాటు పెద్ద ఎత్తున హిందూ సోదరులు పూజలు చేయడం సామరస్యతకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచి భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటిందన్నారు. జిల్లాలో సోదరభావం, సమైక్యత భావం మున్ముందు కూడా కొనసాగాలని ఆకాంక్షించారు. జిల్లా అదనపు ఎస్.పి (అడ్మిన్) కె.ప్రకాష్ బాబు మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు ఆచరించే ముస్లిం సోదరులకు ఇచ్చే ఇఫ్తార్ విందు లాంటి కార్యక్రమాలు ప్రజలలో సోదర భావాన్ని పెంపొందిస్తాయన్నారు. ముస్లిం ప్రముఖులు మాట్లాడుతూ భిన్నత్వంలో ఏకత్వం ఉండటం మన దేశ గొప్పతనమని, అందువల్లే ప్రపంచ దేశాలు దేశ కీర్తి ప్రతిష్టలను కొనియాడారు. కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ బి.రమణయ్య, నగరంలోని ముస్లిం ప్రముఖులు, వన్ టౌన్ సి.ఐ రామకృష్ణ, టూ టౌన్ సి.ఐ నాగార్జున, చిన్నచౌకు సి.ఐ ఓబులేసు, ఆర్‌ఐలు వీరేష్, శ్రీశైల రెడ్డి, శివరాముడు, చిన్నచౌకు ఎస్.ఐ రాజరాజేశ్వర రెడ్డి, టూ టౌన్ ఎస్.ఐ ఎస్.కె.ఎం హుస్సేన్, రిమ్స్ ఎస్.ఐ జయరాముడు, పోలీస్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు దూలం సురేష్, పోలీస్ సిబ్బంది, నగరంలోని ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో
ఇఫ్తార్ విందు
ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్పీ ఈ.జి. అశోక్ కుమార్

మత సామరస్యానికి ప్రతీక కడప జిల్లా