
● వైఎస్సార్‌సీపీ పాలనలో ఆరంభంలోనే..
రైతులు పంటల సాగు కోసం ఎలాంటి ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఖరీఫ్ ఆరంభంలోనే పెట్టుబడి సాయం (వైఎస్సార్ రైతు భరోసా) అందించి అన్నదాతలకు అండగా నిలిచింది. ఏటా క్రమం తప్పకుండా ఈ మొత్తాన్ని అందించింది. పీఎం కిసాన్ సాయం కింద రూ.6 వేలు, వైఎస్సార్ రైతు భరోసా కింద రూ.7500 మొత్తం కలిపి ఏడాదికి రూ.13500 అందజేసింది. ఈ మొత్తాన్ని మూడు విడతల్లో రైతు ఖాతాలకు జమ చేసింది. ఇందులో ఖరీఫ్ ప్రారంభం, రెండవది కోతల సమయం, మూడవది ధాన్యం ఇంటికి చేరే వేళ అందించారు. ఇలా వైఎస్సార్ రైతు భరోసా, పీఎం కిసాన్ కింద ఐదేళ్లపాటు రూ.1191.03 కోట్లను అన్నదాతలకు అందించి అండగా నిలిచింది. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు ఏడాదికి రాష్ట్ర వాటా కింద రూ.14 వేలు అందిస్తామని ప్రకటించింది. అంటే ఏడాదికి కేవలం రాష్ట్ర ప్రభుత్వం అందించే అన్నదాత సుఖీభవ పథకం కింద జిల్లా రైతాంగానికి రూ. 294.67 కోట్లు అందనుంది. అలాగే గత ప్రభుత్వం కంటే అదనంగా ప్రతి రైతులకు ఏడాదికి రూ.6500 చొప్పున లబ్థి చేకూరనుంది. ఈ లెక్కన జిల్లా వ్యాప్తంగా 210481 మంది రైతులకు ఏడాదికి అదనంగా 136.81 కోట్లు అందనుంది. అంటే జిల్లా రైతాంగానికి రైతు భరోసా, పీఎం కిసాన్ రెండు కలిపి ఏడాదికి రూ. 431.48 కోట్లు అందనుంది. ఈ మొత్తాన్ని కూటమి ప్రభుత్వం జిల్లా రైతుల ఖాతాలకు ఏడాదికి జమ చేయాల్సి ఉంటుంది.