
ఎలుగుబంటి
అట్లూరు : అట్లూరు మండల పరిధిలోని కొండూరు గ్రామంలో ఎలుగుబంటి సంచారం గ్రామస్తులను హడలెత్తిస్తోంది. అసలే ఎండలు ఆపై ఉక్కపోత తట్టుకోలేక రాత్రివేళల్లో గ్రామస్తులు ఆరుబయట నిద్ర పోతున్నారు. ఈ నేపథ్యంలో గత నాలుగు రోజులుగా నల్లకుంట చెరువు లోని కంపచెట్ల నుంచి రాత్రి వేళల్లో ఎలుగుబంటి వీధుల్లోకి వస్తోంది. దీంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. అయితే కుక్కలు వెంటబడడంతో ఎలుగుబంటి కంపచెట్లలోకి వెళుతోందని, ఎప్పుడు ఎవరిమీద పడి దాడి చేస్తుందో అని గ్రామస్తులు బిక్కుబిక్కుమంటున్నారు.
కడప ఉక్కు పరిశ్రమపై స్పందించాలి
ప్రొద్దుటూరు : కడప ఉక్కు పరిశ్రమపై రాయలసీమ మంత్రులు, ఎమ్మెల్యేలు స్పందించాలని రాయలసీమ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు జగన్ తెలిపారు. స్థానిక పాలిటెక్నిక్ కళాశాలలో మంగళవారం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన చట్టంలో కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారన్నారు. 11 ఏళ్లు అయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కడప ఉక్కు పరిశ్రమ గురించి పట్టించుకోవడం లేదన్నారు. కేవలం ఉక్కు పరిశ్రమను శంకుస్థాపనలకే పరిమితం చేశారన్నారు. రాయలసీమ ప్రజలను ఓట్లు, సీట్ల కోసం వాడుకుంటున్నారే తప్ప అభివృద్ధి చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు.
ఉరి వేసుకుని యువతి ఆత్యహత్య
పోరుమామిళ్ల : మండలంలోని రాజాసాహేబ్‌పేట పంచాయతీ తిరువెంగళాపురానికి చెందిన కల్లూరి రామతులసి(25) మంగళవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్యహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ కొండారెడ్డి తెలిపారు. వివాహ సంబంధాల విషయంలో ఆమె తీవ్ర అసంతృప్తితో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు తండ్రి జయరామిరెడ్డి పోలీసులకు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ చెప్పారు.
పదో తరగతి విద్యార్థిని అదృశ్యం
లక్కిరెడ్డిపల్లి : మండలంలోని కాకులవరం గ్రామానికి చెందిన పదోతరగతి విద్యార్థిని చివరిరోజు పదో తరగతి పబ్లిక్ పరీక్ష రాసి కనిపించలేదని బాలిక తల్లిదండ్రులు లక్కిరెడ్డిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి బాలిక కోసం గాలిస్తున్నట్లు ఎస్‌ఐ రవీంద్ర బాబు తెలిపారు.

పదో తరగతి విద్యార్థిని అదృశ్యం