బద్వేలు అర్బన్ : నీరు తాగేందుకు బావిలోకి దిగి ప్రమాదవశాత్తు బావిలో పడి యువకుడు మృతి చెందిన ఘటన బుధవారం మండల పరిధిలోని కోనసముద్రం గ్రామంలో జరిగింది. ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. బి.మఠం మండలం టి.రామా పురం గ్రామానికి చెందిన నాగిపోగు హృదయరాజు (32) గొర్రెలు మేపుకుంటూ జీవనం సాగిస్తుండేవాడు. ఈయనకు భార్య దివ్యశ్రీతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. గొర్రెల మేత కోసం పచ్చని గ్రాసం ఉన్న గ్రామాలకు బృందాలుగా వెళుతుంటారు.
ఈ క్రమంలో కోనసముద్రం సమీపంలోకి కొందరు గొర్రెల పెంపకందారులు గొర్రెలను మేత కోసం తీసుకువచ్చారు. మధ్యాహ్నం సమయంలో దాహం వేస్తుండటంతో నీరు తాగి వస్తానని చెప్పి బావి వద్దకు వెళ్లాడు. అయితే ఎంత సేపటికి తిరిగి రాకపోవడంతో తోటి కాపరులు బావిలోకి వెళ్లి చూడగా బావిలో నీటిపై తేలియాడుతూ కనిపించాడు. వెంటనే వారు బావిలోకి దిగి హృదయరాజును బయటికి తీసుకురాగా అప్పటికే మృతి చెంది ఉన్నాడు.
అయితే హృదయరాజుకు ఈత రాదని తెలిసింది. నీరు తాగే సమయంలో ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెంది ఉండవచ్చని కుటుంబ సభ్యులు, పోలీసులు భావిస్తున్నారు. మృతుని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ ఏఎస్‌ఐ చంద్రమౌళి కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.