
వైవీయూ క్యాంపస్ డ్రైవ్‌కు విశేష స్పందన
కడప ఎడ్యుకేషన్ : యోగి వేమన విశ్వవిద్యాలయం క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్‌కు విశేష స్పందన లభించింది. ప్రముఖ బయోకాన్ మల్టీనేషనల్ కంపెనీ వైవీయూలో గురువారం చేపట్టిన ఎంపికలకు తిరుపతి, వైజాగ్, గుంటూరు, రాజమండ్రి, బాపట్ల, అన్నమయ్య, కడప జిల్లాల నుంచే కాక చత్తీస్‌ఘడ్, ఒడిస్సా, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి 500 మంది ఇంజినీరింగ్, డిగ్రీ పీజీ అర్హత గల అభ్యర్థులు హాజరయ్యారు. వైవీయూ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎస్ రఘునాథ్‌రెడ్డి , రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పుత్తా పద్మలు క్యాంపస్ డ్రైవ్ ప్రారంభించి మాట్లాడారు. విశ్వవిద్యాలయ ప్లేస్మెంట్ సెల్ డైరెక్టర్ ఆచార్య జి.విజయ భారతి ఎంపికల ప్రక్రియను సమన్వయం చేశారు. బయోకాన్ కంపెనీ క్వాలిటీ అస్సూరెన్స్ మేనేజర్ లక్ష్మినరసయ్య, హెచ్.ఆర్ విభాగ డిప్యూటీ మేనేజర్ జయప్రకాష్, ఎస్సార్ డైరెక్టర్ జయభారత్, ఆపరేషన్ హెడ్ ఎన్‌హెచ్ అశోక్, క్లస్టర్ హెడ్ రాజశేఖర్, హెచ్‌ఆర్ విభాగ ఆర్ శరత్ విద్యార్థులకు మౌఖిక పరీక్ష నిర్వహించారు. ఇందులో 160 మంది అభ్యర్థులను కంపెనీ ప్రొడక్షన్, క్వాలిటీ కంట్రోల్ ,ఇంజనీరింగ్ అండ్ మెయింటెనెన్స్ విభాగాలలో ఉద్యోగాలకు ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ పాలకమండలి సభ్యురాలు ప్రొఫెసర్ చంద్రమతి శంకర్, ప్లేస్మెంట్ సెల్ ప్రతినిధులు డాక్టర్ లలిత, డాక్టర్ గణేష్ నాయక్, డాక్టర్ సుభోస్ చంద్ర, అధ్యాపక, బోధనేతర సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.